హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): అటవీ సమీప గ్రామాల్లోని పశువులు, గొర్రెలు, మేకలకు అవసరమైన పశుగ్రాసం కొరతను అధిగమించడంతో పాటు అటవీ రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కోసం తెలంగాణ అటవీ శాఖ మరో కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) పరిధిలో 50 నుంచి 100 హెక్టార్ల విస్తీర్ణంలో ‘పల్లె పశువు వనాలు’ అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అత్యధికంగా క్షీణించిన అటవీ అంచు ప్రాంతాలలో గడ్డి భూములను సృష్టిస్తున్నది.
ఇక్కడ ఇంటెన్సివ్ మేనేజ్మెంట్ విధానంలో పశువులకు రుచికరంగా ఉండే పశుగ్రాసాన్ని స్థానిక గ్రామాల రైతుల అవసరాలకు అనుగుణంగా విస్తారంగా పెంచనున్నారు. ఒకో డీఎఫ్‌వో పరిధిలో ఒక పల్లె పశువు వనం అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పాటు.. వచ్చే ఏడాదిలోగా కొన్నింటినైనా ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్త్తున్నారు. ఇప్పటికే, వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వనాలను అభివృద్ధి చేయడానికి అనువైన ప్రదేశాలను గుర్తించడానికి సర్వేను నిర్వహించిందని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్ తెలిపారు.
ఈ వనాలకు అవసరమైన గడ్డి విత్తనాలు, స్పింకర్లు, డ్రిప్ ఏర్పాటుకు అవసరమైన నిధులను అటవీశాఖ సమకూర్చనున్నది. ఆ విధంగా అభివృద్ధి చేసిన పల్లె పశు వనాల్లో రొటేషన్ పద్ధతిలో జిల్లాలోని అటవీ సమీప ప్రాంత గ్రామాల్లోని పశువులు, గొర్రెలు, మేకలను పశుగ్రాసానికి అనుమతిస్తారు. వనంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో వారానికి ఒక ప్రదేశంలో మాత్రమే వీటిని అనుమతిస్తారు.
మరో వారంలో మరొక స్థలాన్ని గుర్తించి అనుమతించనున్నట్టు అధికారులు తెలిపారు. పశువులను మేత కోసం అనుమతించిన ప్రాంతాలకు మళ్లించేలా గ్రామస్తులను ఆ శాఖ అధికారులు ఒప్పించి, ఈ ప్రాంతాలకు కంచె వేయడానికి కృషి చేస్తారు. ఈ విధంగా పశువులకు, మొత్తంగా అటవీ ప్రాంతానికి రక్షణ లభిస్తుంది. అధిక దిగుబడినిచ్చే మంచి పశుగ్రాసం పశువులకు అన్ని సీజన్లలో సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ చర్యతో గ్రామస్తులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, మానవ-జంతు సంఘర్షణలను నివారించడానికి అవకాశాలుంటాయని డోబ్రియాల్ చెప్పారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో గొర్రెల కాపరులు, పశువుల పెంపకందారులు, ముఖ్యంగా నల్గొండ, నారాయణపేట, గద్వాల్, మహబూబ్‌నగర్ జిల్లాల నుండి సుదూరం వలస వచ్చినవారు అడవి మధ్యలోకి పశువులను తీసుకెళతారు. గొర్రెల కాపరులు, పశువుల పెంపకందారులు కలిసి ఈ ప్రాంతంలో నెలల తరబడి విడిది చేస్తారు. దీనివల్ల స్థానిక వృక్షజాలం, జంతుజాలంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోని మద్దిమడుగు ‘చింకారాల’ సంతతికి ఏర్పడుతున్న సమస్య ఇందులో ముఖ్యమైంది.
అటవీ ప్రాంతంలోకి వచ్చిన పశువులు, గొర్రెలు స్థానిక వృక్షజాలాన్ని తిన్నప్పుడు.. వాటి లాలాజలం ఆ మొక్కలపై పడుతుందని, ఆ తర్వాత వాటిని మేసిన చింకారాలు, ఇతర అటవీ జంతువులు వ్యాధులకు లోనవుతాయని అధికారులు తెలిపారు. ఇంకా, పశువులు, గొర్రెలు, మేకల కాళ్లు, నోటి నుంచి విడుదలయ్యే సూక్ష్మజీవులతో అడవుల్లోని మొక్కలు, జంతువులకు రకరకాల అంటువ్యాధులు సోకుతున్నాయని, పశువుల మలమూత్ర విసర్జనలతో అటవీ పర్యావరణం దెబ్బతిని విలువైన అటవీ సంపద నశిస్తున్నది. పులి, తదితర వన్యప్రాణుల సంరక్షణకు ఇది ప్రమాదకరంగా మారుతున్నదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి, అటవీ అక్రమణలు, పశువుల కాపరులు, గొర్రెల కాపరుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ ‘పల్లె పశు వనాలు’ తీర్చిదిద్దుతున్నామని డోబ్రియాల్ వెల్లడించారు.