నాగర్కర్నూల్, మే 14 : నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రోడ్డుకిరువైపులా ఉన్న పలు చిరువ్యాపారుల దుకాణాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు తొలగించారు. సమాచారం ఇవ్వకుండా కూల్చి వేస్తున్నారంటూ వ్యాపారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ నుంచి కొల్లాపూర్ చౌరస్తా వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా, నల్లవెల్లి రోడ్డులో ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
స్పెషల్ డ్రైవ్లో భాగంగా బుధవారం ఆర్డీవో కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు పండ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, చాయ్ దుకాణాలను జేసీబీతో కూల్చివేశారు. రేకుల షెడ్లను, తడకలను పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. వ్యాపారాలు నిర్వహిస్తుండగానే తొలగింపు పనులు చేపట్టడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం లేకుండా తొలగించడమేమిటని నిలదీశారు. తాము రోడ్డునపడ్డామని పలువురు చిరువ్యాపారులు వాపోయారు. వారం ముందుగానే చిరువ్యాపారులకు సమాచారం అందించామని, పట్టించుకోకపోవడంతో తొలగిస్తున్నట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు.