వరంగల్, జనవరి 24 : అన్ని అనుమతులున్నా.. ఆక్రమించిన స్థలం కాకున్నా.. కేవలం బీఆర్ఎస్ నేత అనే ఒకే ఒక్క కారణంతో అతడు నడుపుతున్న షాపుపైకి బుల్డోజర్ను పంపి వరంగల్ బల్దియా నిమిషాల్లో నేలమట్టం చేసింది. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కుంటిసాకులు చెప్పి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, కుడా అధికారులు దగ్గరుండి మరీ షాపును కూల్చేశారు. వరంగల్ భద్రకాళీ ఆలయం ముందున్న ప్రైవేట్‌లో స్థలంలో 29వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్-సరి త దంపతులు ఐదేండ్లుగా టీ, టిఫిన్, బేకరీ షాపు నిర్వహిస్తున్నారు. బల్దియా నుంచి ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. అయితే నోటీసులు ఇవ్వకుండానే బల్దియా, కుడా అధికారులు శనివారం తెల్లవారుజామున 6గంటలకు షాపు వద్దకు చేరుకొని నిమిషాల్లో కూల్చివేశారు. బాధితుడు సదాంత్ ఏ కారణంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని అడిగినా అధికారులు సమాధానం చెప్పకుండా షాఫును నేలమట్టం చేసి వెళ్లిపోయారు. దళిత వ్యక్తికి సంబంధించిన షాపుపై బల్దియా, కుడా అధికారుల దౌర్జన్యం చూసిన స్థానికులు నిర్ఘాంతపోయారు.
బీఆర్ఎస్పై కక్షపూరిత వైఖరి: ఆర్ఎస్పీ
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జేసీబీలతో వచ్చి షాపును కూల్చివేయడాన్ని ఖండించారు. మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్‌తో కలిసి కూలిన షాప్ ను పరిశీలించారు. అన్ని అనుమతులతో వ్యా పారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడి షాపును కూల్చివేయడం అన్యాయమని ఆగ్రహం వ్య క్తం చేశారు. మేయర్, ఎమ్మెల్యే ప్రోద్బలంతో నే అధికారులు కూల్చేశారని ఆరోపించారు. ఏ కారణంతో కూల్చివేశారో చెప్పాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. బల్దియా, కుడా అధికారుల తీరుపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌తో పాటు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వెంటనే షాపును పునరుద్ధరించాలని, లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు, దళిత సంఘాలతో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కూల్చివేతపై కమిషనర్, ఏసీపీకి ఫిర్యాదు
నోటీసులివ్వకుండా షాపును కూల్చిన బల్దియా, కుడా అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు దాస్యం విజయ్‌భాస్కర్, కార్పొరేటర్లతో కలిసి బాధితుడు సదాంత్ గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఏసీపీ శుభం ప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.