హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గత సర్పంచ్ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజల ఆదరణతో మెజారిటీ స్థానాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. ఇందుకు విరుద్ధంగా ప్రస్తుత ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగా స్థానాలు గెలుచుకోలేక చతికిలపడింది. బీఆర్ఎస్ తరహాలో ప్రజల ఆదరణ పొందలేకపోయింది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు ఎదురుగాలి తప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజారిటీ స్థానాలను గెలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. గత సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలో బీఆర్ఎస్ 64 శాతం సీట్లు గెలుచుకొని సత్తా చాటగా ప్రస్తుతం అధికార కాంగ్రెస్ కేవలం 44 శాతంతోనే సరిపెట్టుకున్నది. గత
ఎన్నికల్లో మొదటి విడతలో 3,701 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, బీఆర్ఎస్ 64 శాతంతో 2,444 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 22.31 శాతంతో 826 స్థానాలనే గెలుచుకున్నది. ప్రస్తుతం మొదటి విడతలో 3,834 స్థానాలకు (ఏకగ్రీవాలు కాకుండా) ఎన్నికలు జరగ్గా 3,757 స్థానాలకు ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీఆర్ఎస్ 35.08 శాతంతో 1345 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ 44 శాతంతో 1702 స్థానాలు గెలుచుకున్నది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్ఎస్ స్థాయిని అందుకోలేపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
సాధారణంగా సర్పంచ్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీదే హవా కొనసాగుతుంది. ఇందుకు గత ఎన్నికలే నిదర్శనం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక స్థానాలు గెలుచుకొని ప్రభంజనం సృష్టించింది. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచింది. అత్యధిక స్థానాలు గెలుచుకోవడంలో విఫలమైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పట్టించింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అధికార పార్టీ అభ్యర్థులతో ఢీ అంటే ఢీ అనేలా పోటీపడ్డారు. బీఆర్ఎస్ ప్రతిఘటనతో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తప్పలేదు. ఈ ఫలితాల నేపథ్యంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశించిన స్థాయిలో చేరదీయలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకున్నదని, ఇందుకు సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శమని స్పష్టంచేస్తున్నారు.
గ్లోబల్ సమ్మిట్ మైకం దిగముందే.. తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ము ఖంపై నీళ్లుచల్లాయి. అధికార పార్టీని, దాని ప్రభావాన్ని తోసిరాజని.. ప్రజలు తమ గుండెను చీల్చి గులాబీ జెండాను చూపించారు. కేసీఆర్ పార్టీపై తమ ప్రేమ తగ్గలేదని నిరూపించారు. మొదటి విడుతలో 4,236 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా, 396 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆరుచోట్ల వివిధ కారణాలతో ఎన్నికలు జరుగలేదు. మిగిలిన 3,834 స్థానాలకు గురువారం పోలింగ్ జరుగగా 77 మినహా మిగతా చోట్ల ప్రజాతీర్పు వెలువడింది.
ప్రభుత్వం చేతిలో ఉన్నా, అధికారబలం అండగా ఉన్నా.. సగం పంచాయతీలనైనా గెలువలేక కాంగ్రెస్ చతికిలపడింది. రేవంత్ ప్రభుత్వంపై నెలకొన్న ప్రజావ్యతిరేకతను తొలిదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు పట్టిచూపించాయి. పంచాయతీ ఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. కానీ ఈ సారి గ్రామీణ తెలంగాణలో భిన్నదృశ్యం కనిపించింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా.. తీవ్ర ప్రజావ్యతిరేకత రేవంత్ ప్రభుత్వాన్ని వెంటాడుతున్న వాస్తవం ప్రచారపర్వంలోనే కనిపించింది. గురువారం నాటి ఫలితాల్లో అది మరింత సుస్పష్టమైంది. కాంగ్రెస్ మంత్రుల, ఎమెల్యేల నిలదీతలు ఆశామాషీ ఘటనలు కావని, అవి ప్రజల్లో కాంగ్రెస్‌పై గూడుకట్టుకుని ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని పంచాయతీ ఫలితాలు స్పష్టంచేశాయి.
2019 సర్పంచి ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్లీన్‌స్వీప్ చేసింది గులాబీ పార్టీ. గత పంచాయతీ ఎన్నికల తొలిదశలో ఏకగ్రీవాలు మినహాయిస్తే.. మొత్తం 3,701 స్థానాలకు ఎన్నికలు జరుగగా, 2,370 పంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది. ప్రజాతీర్పును ఎదుర్కొని 64శాతం గ్రామాలను కైవసం చేసుకున్నది బీఆర్ఎస్. మరి ఇప్పుడు? ఏకగ్రీవాలను మినహాయిస్తే తొలివిడుత ఎన్నికలు జరిగిన 3,834 పంచాయతీలకు 1,702 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్నది. అంటే తొలివిడతలో ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో కాంగ్రెస్ గెలిచింది కేవలం 44 శాతమే! ఎక్కడ 64 శాతం!.. ఎక్కడ 44!
భయపెట్టి, ప్రలోభపెట్టి, దాడులు చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడి.. కొన్ని పంచాయతీల్లో తన అభ్యర్థులను ఏకగ్రీవం చేసుకోగలిగిన కాంగ్రెస్.. ప్రజాతీర్పు కోసం పల్లె ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సినప్పుడు మాత్రం తెల్లముఖం వేసింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా, గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని తరహాలో విజయోత్సవాల పేరిట పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రచారానికి తిరిగారు రేవంత్. కోడ్‌ను ఉల్లంఘిస్తూ శంకుస్థాపనలు చేశారు. హామీలు గుప్పించారు. అయినా ఫలితం లేకపోయింది. పల్లె ఓటరు పట్టించుకోలేదు. తీవ్ర అణచివేత, దౌర్జన్యకాండ మధ్య కూడా.. గులాబీ జెండా రెపరెపలాడింది.
సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
కాంగ్రెస్ =1702
బీఆర్ఎస్ 1345
బీజేపీ = 186
ఇతరులు = 5241345
మొదటివిడత పంచాయతీలు = 4236
పోలింగ్ జరిగినవి = 3834
ఎన్నికలు జరగనివి = 6
ఏకగ్రీవాలు = 396
ఓటింగ్ = 84.28%