హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గృహ విద్యుత్తు వినియోగదారులకు ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. అన్ని అనుమతులున్న ఇండ్లను మాత్రమే డొమెస్టిక్ క్యాటగిరీలో కొనసాగించాలని, అనుమతుల్లేని ఇండ్లను టెంపరరీ క్యాటగిరీలో చేర్చడం ద్వారా నిబంధనల పేరుతో ఇబ్బడిముబ్బడిగా బిల్లులు వసూలు చేయాలని టీజీఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల మంది విద్యుత్తు వినియోగదారులపై తీవ్ర భారం పడటం ఖాయం. బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారిపై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే.. ఆ భవనాల్లో కొన్ని ఫ్లోర్లకే అనుమతులుంటాయి.
ఇకపై ఆ అంతస్తుల్లోని విద్యుత్తు కనెక్షన్లనే డొమెస్టిక్ క్యాటగిరీలో కొనసాగించి డిస్కమ్ నిర్ణయించిన స్లాబ్ ప్రకారం బిల్లింగ్ చేస్తారు. దీంతో ఆయా ఇండ్లలోని 80% మంది వినియోగదారులకు 300 యూనిట్లలోపు స్లాబ్ వల్ల రూ.వెయ్యి నుంచి రూ.2 వేలలోపు బిల్లు వస్తుంది. అంటే యూనిట్‌కు రూ.5 నుంచి రూ.7.వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, అనుమతుల్లేకుండా నిర్మించిన మిగిలిన ఫ్లోర్లలోని ఇండ్ల కనెక్షన్లను డొమెస్టిక్ క్యాటగిరీ నుంచి టెంపరరీ క్యాటగిరీలోకి మార్చడం వల్ల యూనిట్‌కు రూ.11పైగా బిల్లు వస్తుంది. దీంతో సాధారణంగా వచ్చే బిల్లు కంటే రెండు మూడు రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి కనెక్షన్లు గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 10 లక్షల వరకు ఉండొచ్చని అంచనా.