మహబూబ్‌నగర్, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మందలకు మందలు.. రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్దీ బారులు.. పచ్చిక భూముల్లో ఎటుచూసినా గుంపులు గుంపులు .. కృష్ణానది పరీవాహక ప్రాంతం గొర్రెలతో కళకళలాడుతున్నది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గొర్రెలు భారీ సంఖ్యలో నది దాటి ఏపీలోని పలు ప్రాంతాల్లో మేత మేయడానికి వెళ్తున్నాయి. డీసీఎంలు, పుట్టీలు, టాటా ఏస్ వాహనాల్లో భారీ సంఖ్యలో గొర్రెలను పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి ఏపీలోని నంద్యాల, కర్నూల్ జిల్లాలకు తీసుకువెళ్తున్నారు. దీంతో తెలంగాణ నుంచి వచ్చిన గొర్రెల మందలకు ఈ ప్రాంతంలో భారీ డిమాండ్ ఏర్పడింది. అక్కడి రైతులు తమ పొలాల్లో మందలను రాత్రికి నిలబెట్టాలని గొర్రెల యజమానులను కోరుతున్నారు. ఇందుకు ప్రతిఫలంగా పొలం యజమానులు గొర్రెల కాపరులకు బట్టలు, భోజన పదార్థాలు ఉచితంగా ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నద్యాల జిల్లాలోని పొలాల్లో మందలు పెట్టేందుకు తోలుకెళ్తున్న తెలంగాణ గొర్రెల కాపరులు
దశ మార్చిన గొర్రెల పంపిణీ
గొల్లకురుమల కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ 2017-18లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. మొదటి విడతలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు రూ.900 కోట్ల విలువైన దాదాపు 12 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. నేడు ఈ సంఖ్య రెట్టింపైంది. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను తమ వద్దే ఉంచుకొని వాటికి పుట్టిన పిల్లలను మాత్రమే యజమానులు అమ్ముకొంటున్నారు. వాటిలోనూ మగ గొర్రెలను మాత్రమే అమ్మి, ఆడవాటిని మందలోనే ఉంచటంతో పునరుత్పత్తి పెరిగి భారీ మందలు ఏర్పడుతున్నాయి. నేడు ఈ మందలను చూస్తే గొర్రెల పంపణీ పథకం ఎంతటి అద్భుత ఫలితాలు ఇచ్చిందో తెలిసిపోతుంది.
మందల క్యూ
పక్కనే నల్లమల అటవీ ప్రాంతం ఉండటం, భారీగా సాగుభూములు అందుబాటులోకి రావటంతో పాలమూరు జిల్లాలో గొర్రెల పంపిణీ పథకం అద్భుత ఫలితాలు ఇచ్చింది. లక్షల సంఖ్యలో గొర్రెల ఉత్పత్తి పెరిగింది. అనేక కుటుంబాలకు రెండు విడతలుగా గొర్రెలను సర్కార్ పంపిణీ చేసింది. ఆ గొర్రెల పునరుత్పత్తితో వాటి సంఖ్య భారీగా పెరిగింది. వీటిని మేపడానికి భారీగా బీడు భూములు అవసరం పడటంతో ఏపీకి తోలుకెళ్తున్నామని మందల యజమానులు తెలిపారు. గతంలో మందలను నదీతీర ప్రాంతాల్లో మేపేవారు. ఇప్పుడు అక్కడి భూములు సరిపోవటం లేదని, అందువల్లే ఏపీకి తోలుకెళ్తున్నామని తెలిపారు. పొద్దంతా గడ్డిమేసిన తర్వాత గొర్రెలను రాత్రిపూట కాపరులు ఒకచోట నిలుపుతారు. అక్కడ గొర్రెలు వదిలే మలమూత్రాలు పంటలకు బలమైన ఎరువులుగా ఉపయోగపడుతాయి. ఏపీలోని రైతులు మందలను తమ పొలాల్లో నిలుపుకొనేందుకు పోటీ పడుతున్నారు. ఒకరోజు పొలంలో మందను నిలిపితే తిండి గింజలతోపాటు, కొంత డబ్బు కూడా ఇస్తున్నారు. తమ భూముల్లో నిలిపిన గొర్రెలకు రైతులు పూజలు చేస్తుండటం విశేషం.
మంద నిలిపితే ఎరువులు అవసరం లేదు
గొర్రెల మందలను పొలాల్లో నిలిపితే ఆ ఏడాది పంటకు ఇతర ఎరువులు వేయాల్సిన అవసరం రాదని రైతులు చెప్తున్నారు. గొర్రెల మలమూత్రాలు సహజ ఎరువుగా పొలానికి బలాన్నిస్తాయి. ఫలితంగా ఆ పొలంలో పంట దిగుబడి పెరుగుతుంది. ఆంధ్రాలో గొర్రెలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. దీంతో మేతకు వెళ్లే తెలంగాణ గొర్రెలను తమ పొలాల్లో నిలపాలని ప్రతి సీజన్లో అక్కడి రైతులు కోరుతున్నారు. వానకాలం, యాసంగి కోతలు అయ్యాక మందలను తిరిగి తీసుకొస్తారు. దాదాపు ఆరునెలల పాటు ఈ వలస కొనసాగుతుంది. రోడ్ల మీద గొర్రెల మందలు వెళ్తుంటే ట్రాఫిక్‌జాం అవుతుంటుంది. జాతీయ రహదారి వెంట ఏపీలోని పలు ప్రాంతాలకు, కృష్ణా పరీవాహక ప్రాంతాలకు గొర్రెల మందలను కాపరులు తీసుకెళ్తున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూర్, జూపాడు బంగ్లా, బన్నూరు, బ్రాహ్మణ కొట్కూరు, నందికొట్కూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రహదారులన్నీ గొర్రెలతో నిండిపోతున్నాయి.
తెలంగాణ సర్కార్ సాయం మర్చిపోలేం
మాది నాలుగు వందల గొర్ల మంద. మొన్ననే ఆత్మకూరు పక్కన బన్నూరుకు తీసుకువచ్చిన. కేసీఆర్ సార్ ఇచ్చిన గొర్లు ఒక యూనిట్ మాకు వచ్చింది. మాతోపాటు చాలామందికి గొర్లు వచ్చినయ్. రెండు విడుతలుగా ఇచ్చారు. ఆ గొర్లు మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇచ్చిన గొర్లను కలిపి ప్రతిఏటా వాటిని సాకి ఎక్కువ చేసినం. గొర్లకు బాగా డిమాండ్ ఉన్నది. ఈ పథకం మన రాష్ట్రంలో మాత్రమే ఉన్నది. ఏపీవాళ్లు మీరు అదృష్టవంతులు అని చెప్తుంటారు.
– బాలకృష్ణ, పెంట్లవెల్లి, కొల్లాపూర్ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ జిల్లా
ఇక్కడ ఐదారు నెలలు ఉంటాం
మేం ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు డీసీఎంలలో వెయ్యి గొర్రెలను తీసుకెళ్లాం. అక్కడ ఐదారు నెలలు ఉండి మేపుతాం. నాతో పాటు ఆరుగురు కాపలాకు వచ్చారు. రోజూ చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు అనుమతిచ్చిన పొలాల్లో గొర్రెలను మేపుతం. యాసంగి సీజన్లో పంట కోతలన్నీ అయిపోయాక తిరిగి ఊళ్లకు వెళ్తాం. ఆరునెలలు మేపితే గొర్రెలు బలిష్ఠంగా మారి ఎక్కువ ధర వస్తది. ఉన్ని ఏపుగా పెరుగుతది.
– మల్లయ్య, పెంట్లవెల్లి, కొల్లాపూర్ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ జిల్లా
నాలుగేండ్లలో 4 లక్షల సంపాదన
వికారాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమం గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నింపింది. సబ్సిడీ గొర్రెల పంపిణీతో గొల్ల, కురుమలు ఏటా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం పొందుతూ సక్సెస్ అవుతున్నారు. 2018లో పంపిణీ చేసిన సబ్సిడీ గొర్రెలతో తన జీవితమే మారిపోయిందని చెప్తున్నాడు వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రానికి చెందిన కల్కొడ చంద్రప్ప. గతంలో వ్యవసాయం చేసినా ఏటా అప్పులే మిగిలేవి. 2018లో ఆయనకు ప్రభుత్వం సబ్సిడీ కింద 21 గొర్రెలను అందజేసింది. అవి పిల్లలు పెట్టడంతో చంద్రప్ప గొర్రెల మంద భారీగా పెరిగింది. పిల్లలను అమ్మి గత నాలుగేండ్లలో రూ.4 లక్షలు సంపాదించారు. ప్రస్తుతం చంద్రప్ప మందలో 80 గొర్రెలు ఉన్నాయి. గొర్రెల పంపిణీ పథకం వల్లనే పైసా అప్పు చేయకుండా తన ఇద్దరు కూతుళ్లు, కొడుకును చదవించానని చంద్రప్ప చెప్తున్నాడు. గొర్రెల మందను పెంచటంతోపాటు తన రెండెకరాల పొలంలో వ్యవసాయం కూడా చేస్తూ చంద్రప్ప అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం
గొర్రెల పంపిణీ పథకంతో మా కుటుంబంలో వెలుగులు నిండాయి. నాకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద బిడ్డ వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తుండగా, మరో కూతురును ఇంజినీరింగ్, కొడుకును పాలిటెక్నిక్ చదివిస్తున్నాను. గొర్రెల పంపిణీ పథకంతో మేం ఏ అప్పులు చేయకుండా మా పిల్లల్ని చదివిస్తున్నాం. ఏటా రూ.లక్ష ఆదాయం వస్తున్నది. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. గొల్ల కురుమలకే కాకుండా అందరికీ కేసీఆర్ సార్ మంచి చేస్తుండు. దేశాన్ని కూడా కేసీఆర్ సార్ పాలిస్తే దేశ ప్రజలంతా సంతోషంగా ఉంటారు.
– కల్కొడ చంద్రప్ప, బంట్వారం, వికారాబాద్ జిల్లా