హైదరాబాద్, జూన్1 (నమస్తే తెలంగాణ) : మహిళల భద్రత కోసం తెలంగాణలో షీ టీమ్స్ ఏర్పాటు గొప్ప ఆవిష్కరణ అని, హైదరాబాద్ అనుభవం తన జీవితంలో మరపురానిదని, అవకాశం వస్తే మళ్లీ హైదరాబాద్‌కు వస్తానని మిస్ వరల్డ్-2025 విజేత ఓపల్ సుచాత (థాయిలాండ్) వెల్లడించారు. హైదరాబాద్ హోటల్ ట్రైడెంట్‌లో ఆదివారం ఆమె మాట్లాడారు. మిస్ వరల్డ్ నిర్వహణకు ప్రభుత్వం అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ అందమైన నగరమని, ఇకడి ప్రజలు స్నేహపూర్వకంగా ఉన్నారని కొనియాడారు.
థాయిలాండ్‌కు ఇది మొట్టమొదటి మిస్ వరల్డ్ క్రోన్ అని, అది తనకు ఎంతో గర్వకారణమని, పెద్ద బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. దేశ ప్రజలతో పాటు, హైదరాబాద్‌లో తమ కోసం పనిచేసిన ప్రతి ఒకరికీ రుణపడి ఉంటానని వెల్లడించారు. బ్యూటీ విత్ పర్పస్ – సేవా కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తానని, థాయిలాండ్‌లో బ్రెస్ట్ కాన్సర్పై ప్రజల్లో అవగాహన కోసం పని చేస్తూ ఫండ్ రైజింగ్ చేస్తున్నానని, ఇకపై తన పర్పస్ ప్రాజెక్ట్‌తో పాటు ఇతర కంటెస్టెంట్స్ పర్పస్ ప్రాజెక్ట్స్‌పై మిస్‌వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కృషి చేస్తానని, మహిళా సాధికారత, సమస్యలపై పనిచేస్తానని, సేవకార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తానని వెల్లడించారు. తెలంగాణ ప్రజల ఆతిథ్యం మరువలేనిదని, ఎప్పటికీ తన మదిలో నిలిచిపోతారని, ఇకడి కళలు, సంప్రదాయాలు, డ్యాన్స్, మ్యూజిక్ ఎంతో ఆకట్టుకున్నాయని, షీ టీమ్స్, మహిళల విద్య, వైద్యం, ఐటీ, మొదలైన రంగాల్లో ఆవిషరణలు అభినందనీయమని కొనియాడారు.