కరీంనగర్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును రీట్వీట్ చేశారని కరీంనగర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. గత నెల 30న శశిధర్ గౌడ్‌ను హైదరాబాద్‌లోని ఆయన ఇంటి నుంచి అరెస్టు చేసి తీసుకొచ్చిన కరీంనగర్ పోలీసులు, ఈ నెల ఒకటిన కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ దొరికిన సమయంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పోలీసులు ఇదే విషయమై మరో కేసు పెట్టి గురువారం పెద్దపల్లి కోర్టులో హాజరుపర్చారు. శశిధర్‌గౌడ్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు రిమాండ్‌ను తిరస్కరించింది. శుక్రవారం ఉదయం ష్యూరిటీలు కోర్టుకు సమర్పించడంతో శశిధర్గౌడ్కు బెయిల్ మంజూరైంది.18 రోజుల పాటు కరీంనగర్ జైల్లో ఉన్న ఆయన బయటకు రాగా, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, శశిధర్‌గౌడ్ న్యాయవాది లలితారెడ్డి, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పావనీగౌడ్, రవినాయక్ తదితరులు స్వాగతించారు.
రేవంత్ సర్కార్‌పై పోరాడుతా..
ఈ సందర్భంగా శశిధర్ గౌడ్ మాట్లాడుతూ, తనను జైలుకు పంపించిన సీఎం రేవంత్ గద్దె దిగే వరకు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచి ఉద్యమిస్తానని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హ్యాండిల్లో పెట్టిన పోస్టును తాను రీట్వీట్ చేసినందుకే 3 కేసులు పెట్టించారని, ఇదే పోస్టును 250 మంది వరకు రీపోస్టు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ శశిధర్లాంటి యువకులు ఎందరినో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నదని చెప్పారు. శశిధర్ గౌడ్ న్యాయవాది లలితారెడ్డి మాట్లాడుతూ పోలీసులు సుమోటోగా నమోదు చేసిన కేసుల్లో ఒక్కదానికి కూడా సరైన ఆధారాలు లేవని, శశిధర్గౌడ్పై మరో తప్పుడు కేసు పెట్టి మరికొంత కాలం జైల్లోనే ఉంచాలని చూసిన పోలీసులకు పెద్దపల్లి న్యాయస్థానం మొట్టికాయలు వేసిందని తెలిపారు.