Navratri Celebrations |హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తేతెలంగాణ): నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారం భం కానున్నాయి. ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలు, మండపాలు ముస్తాబయ్యాయి. భక్తులు తొమ్మిది రోజులపాటు తీరొక్క అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారికి భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించనున్నారు. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి 12వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు. 12న విజయదశమిని పురస్కరించుకొని రాత్రి 7:45 గంటలకు పద్మావతి అమ్మవారు గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. కాగా, నవరాత్రి ఉత్సవాల కారణంగా 10 రోజులపాటు కల్యాణోత్సవం సేవను రద్దు చేసినట్టు అధికారులు పేరొన్నారు. 4, 11వ తేదీల్లో లక్ష్మీపూజ, 12న ఊంజల సేవలను రద్దు చేసినట్టు వివరించారు.