హైదరాబాద్: ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడేలా చేస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన మరువక ముందే పలు విమానాలు సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. తాజాగా శంషాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ (SpiceJet) ఎస్జీ-2138 విమానంలో టెక్నికల్ ఇష్యూస్‌తో నిలిచిపోయింది. విమానం బయల్దేరడానికి ముందే సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ విషయాన్ని అధికారులకు చేరవేశారు. దీంతో సంస్థ ఆ సర్వీసును రద్దుచేసింది.
అందులో తిరుపతి వెళ్లాల్సిన 54 మంది ప్రయాణికులను మరో విమానంలో పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సాంకేతిక సమస్యను ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదమే తప్పిందని ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అదే గాల్లో ఉండగా ఏదైనా జరిగితే తమ పరిస్థితి ఎలా ఉండేదోనని అంటున్నారు.
గత నెల 16న కూడా ఇదే సర్వీస్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ 2138 నంబర్ విమానంలో కాలిన వాసన రావడంతో విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు. టేకాఫ్ ముందే ఫ్లైట్‌ని ఎయిర్ పోర్టులో నిలిపివేసి చెక్ చేసారు. క్షణాల్లో గాల్లో ఎగరాల్సిన విమానం సాంకేతికలోపం కారణంగా ఎయిర్ పోర్టులో నిలిపివేయడంతో ప్రయాణికులు సుమారు మూడున్నర గంటల పాటు ఇబ్బందులు పడ్డారు.
Boeing 767 | గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు.. బోయింగ్ విమానానికి తప్పిన పెను ప్రమాదం.. వీడియో