శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 7 : శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్‌పోస్ట్ పోలీస్‌స్టేషన్ సీఐ సంపతి కనకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ ఏసీబీకి చిక్కారు. ఫేక్ పాస్‌పోర్ట్ కేసు నుంచి తప్పించేందుకు కేరళకు చెందిన నిందితుడిని వీరిద్దరు రూ.15లక్షలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వకపోతే కుటుంబసభ్యులకు అరెస్టు, కేసు విషయం చెబుతామని బెదిరించడంతో అతడు రూ.5లక్షలు ఇచ్చేందుకు అంగీకరించాడు. లంచం విషయమై బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చాడు.
ఈ మేరకు మంగళవారం ఔట్‌పోస్ట్‌లో నిందితుడి నుంచి రూ.2లక్షల నగదు తీసుకుంటుండగా సీఐ, ఎస్సైను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10గంటల దాకా విచారణ కొనసాగించారు. సీఐ నివాసంలో జరిపిన సోదాల్లో రూ.35లక్షల నగదు దొరికినట్టు సమాచారం.