శామీర్‌పేట/జవహర్‌నగర్, మే 26 : మేడ్చల్-మలాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ సుచరిత, ఆమె డ్రైవర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. అలియాబాద్ ప్రాంతంలో 30 ఎకరాల భూముల కన్వర్షన్ కోసం రైతుల నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్టు సుచరితపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్, సిబ్బంది మంగళవారం ఆమె కార్యాలయంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ సమయంలో రైతుల నుంచి డ్రైవర్ రూ.2 లక్షలు స్వీకరించి సుచరితకు అందజేస్తుండటంతో ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అక్కడే పలు గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం గతంలో కూడా అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. 2024లో ఎమ్మార్వో సత్యనారాయణ రూ.2 లక్షల లంచం కేసులో డ్రైవర్‌తో కలిసి ఏసీబీకి చిక్కడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సుచరితపై అవినీతి ఆరోపణలు రావడం ఇదేమీ కొత్తకాదు. గతంలో ఆమె కాప్రా తహసీల్దార్‌గా పనిచేసినప్పుడు జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ భూమిలో మహిళాశక్తి భవన్ పేరిట అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జించినట్టు బహిరంగంగానే విమర్శలు వినిపించాయి.
వడ్డేపల్లి: పొలం సర్వే చేయడానికి ఓ సర్వేయర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వివరాలు ప్రకారం.. వడ్డేపల్లి మండలంలోని కొంకల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన నాలుగు ఎకరాల 14 గుంటల భూమి సర్వే చేయడానికి సర్వేయర్ బ్రహ్మయ్య రూ.20 వేలు లంచం అడిగాడు. ఈ మేరకు రూ.15 వేలకు ఒప్పందం చేసుకున్న రైతు.. అడ్వాన్సుగా రూ. 5వేలు ఇచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం కార్యాలయం వద్ద రైతు నుంచి సర్వేయర్ బ్రహ్మయ్య రూ.10వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు సర్వేయర్ బ్రహ్మయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.