హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటు చేసిన షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను తమకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. వర్గీకరణ విధానంపై కొన్ని అపోహలున్నాయని, నివేదికలో ఏం ఉన్నదో, వర్గీకరణ ఎలా చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. కానీ, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా నివేదిక ఇవ్వడం లేదని, ఫోన్‌చేసినా అసెంబ్లీ కార్యదర్శి స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై మంగళవారం అసెంబ్లీలో వివేక్ మాట్లాడుతూ.. హర్యానా, తమిళనాడు, పంజాబ్ మాదిరిగా ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని, ఆ తర్వాతే వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మాలలే అన్ని ఉద్యోగాలు, రిజర్వేషన్లు తీసుకున్నారనే దుష్ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ.. 2016-24 మధ్య కాలంలో మాదిగలకు 66,522 ఉద్యోగాలు, మాలలకు 48,388 ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో మాదిగలకు 66,453 వచ్చాయని, మాలలకు 41,413 వచ్చాయని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 10,776 మంది మాదిగలకు, 3,759 మంది మాలలకు రుణాలు వచ్చినట్టు చెప్పారు. జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీలకు 18% నిధులు కేటాయించాలని, మాల కార్పొరేషన్, నేతగాని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, 100 కోట్ల కార్పస్ ఫండ్‌తో రుణాలు ఇప్పించాలని, 15% నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాలల కంటే మాదిగల పరిస్థితే మెరుగ్గా ఉన్నట్టు ఉషామెహ్రా కమిషన్ స్పష్టం చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.