జనగామ, మే 1 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు కార్మిక దినోత్సవం జరుగుతుంటే.. మరోవైపు జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పారిశుద్ధ్య కార్మికులను అవమానకర రీతిలో నోటి దురుసుతనంతో మాట్లాడారు. కార్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం విధులకు రాలేమని, తప్పనిసరైతే మధ్యాహ్నం 3 గంటలకు హాజరవుతామని చెబితే.. ‘ఆ టైమ్‌లో మీరు తాగి ఉంటారు’ అంటూ కార్మికులను తాగుబోతులుగా చిత్రీకరించారు. పైగా ఆదేశాలు పాటించకపోతే విధుల్లోంచి తొలగించి కొత్తవారిని పెట్టుకొంటానంటూ పారిశుద్ధ్య కార్మికులను కమిషనర్ భయపెట్టే రీతిలో వ్యవహరించారు.
ఇదే విషయమై కార్మిక సంఘాల నాయకులు కమిషనర్‌కు ఫోన్ చేసి అడిగితే వారిపట్ల కూడా అభ్యంతకరంగా మాట్లాడారు. దీంతో కార్మికులు కమిషనర్ చాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా సదరు నాయకులు కార్మికులతో కలిసి కమిషనర్ చాంబర్లోకి దుసుకెళ్లి ఆయనను నిలదీశారు. ఎన్నికల విధుల పేరిట తమ హకులను కాలరాస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.