హైదరాబాద్: షేక్‌పేట మాజీ తహసీల్దార్ సుజాత గుండెపోటుతో మరణించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత.. వారం క్రితం నిమ్స్ దవాఖానలో చేరారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతిచెందారు. బంజారాహిల్స్‌లోని కోట్ల రూపాయల విలువైన భూ వివాదం కేసులో చిక్కుకున్న ఆమె.. 2020 జూన్‌లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులు అరెస్టయిన విషయం తెలిసిందే. కాగా, సుజాత జైలులో ఉండగానే అదే నెలలో ఆమె భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని ఓ భూవివాదంలో లంచం ఆరోపణలపై తహసీల్దార్ సుజాతను 2020 జూన్ 8న పోలీసులు అరెస్టు చేశారు. ఖాలీద్ అనే వ్యక్తి నుంచి ఆమె లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో పాటు, ఆమె ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీకి రూ.30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దొరికాయి. వాటికి సంబంధించి ఎమ్మార్వో సరైన ఆధారాలు చూపకపోవడంతో.. భూవివాదం కేసు వ్యవహారంలో ఆమె పాత్రను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.