మహబూబ్‌నగర్, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నడిగడ్డలో ఓ అధికార పార్టీ నేత షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు ఏ పదవీ లేకపోయినా అధికారులు కొత్తగా ఎవరు వచ్చినా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేదంటే ఆయన ఆగ్రహానికి గురికావాల్సిందే. లేదా అక్కడి నుంచి బదిలీ చేయించుకొని వెళ్లిపోవాల్సిందే. అధికారులే ఆ షాడో ఎమ్మెల్యేకు నెలనెలా మామూళ్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముడుపులు ఇవ్వకపోతే అధికారులను అక్కడి నుంచి బదిలీ చేయిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆ షాడో ఎమ్మెల్యే నెలకు రూ.50 లక్షలు సంపాదిస్తున్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి. తుమ్మిళ్లతోపాటు పుల్లూరు తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇసుకను సరఫరా చేస్తుంటారు. జిల్లాలో మొత్తం 22 నుంచి 25 టిప్పర్లు ఇసుకను ప్రజల, ప్రభుత్వ, ఇతర అవసరాల నిమిత్తం రీచ్‌ల నుంచి తీసుకెళ్తారు. అయితే ఆ షాడో ఎమ్మెల్యేకు నెలకు ఒక్కో టిప్పర్ యజమాని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు చెల్లిస్తున్నట్టు సమాచారం. వారు ఇక ఎక్కడి నుంచైనా.. ఎక్కడికైనా ఇసుకను యథేచ్ఛగా తరలించుకోచ్చన్న నిబంధన ఉన్నట్టు తెలిసింది. దీంతోపాటు తన సమీప బంధువులు, తన కార్యకర్తలకు చెందిన టిప్పర్ల ద్వారా ఎటువంటి అనుమతి లేకుండా జిల్లాలో ఎక్కడైనా ఇసుక తరలించేందుకు దారులు తెరిచినట్టు సమాచారం. ఇలా ఇసుక దందాలో నెలకు ఆ షాడో ఎమ్మెల్యే రూ.50 లక్షల వరకు సంపాదిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
జిల్లాకు ఏ అధికారి వచ్చినా మొదట ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని వినికిడి. ఈ మధ్య నడిగడ్డలో కొంతమంది పోలీసుల బదిలీలు జరిగాయి. వారు పోస్టింగ్ తీసుకోక ముందే ఆ షాడో ఎమ్మెల్యే పీఏ ఫోన్ చేసి.. ‘సార్‌ను కలవాలి.. మీకు మా సారు పోస్టింగ్ ఇప్పించారు’ అంటూ పదే పదే ఫోన్ చేసి విసిగించడంతో జాయిన్ కాకముందే సారును ప్రసన్నం చేసుకున్నారు. ఇక అక్కడితో ఆగిపోలేదు. పదే పదే విసిగించడంతో ఓ పోలీస్.. మరో ఖాకీతో ఎందుకు కలవాలని అమాయకంగా అడగడంతో.. ‘మేము ముడుపులు ఇవ్వనందుకే మమ్మల్ని బదిలీ చేయించారు.. ఇక్కడ ఎవరు పోస్టింగ్‌కు వచ్చినా ఆ షాడో ఎమ్మెల్యేను కలవాల్సిందే’ అని చెప్పడంతో బదిలీపై వచ్చిన అతడికి ఎక్కడి నుంచి ముడుపులు చెల్లించాలని తోటి ఉద్యోగితో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఆ షాడో ఎమ్మెల్యేకు అధికారులు సహకరిస్తుండటంతో ఆయన దందాలు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తున్నది.