హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : అతనికి ఏజెన్సీ లేదు.. కాంట్రాక్టర్ కా దు.. ప్రభుత్వ అధికారి అంతకన్నా కాదు.. కానీ వైద్యారోగ్య శాఖలో అతడు చెప్పిందే వేదం. ఏ పని కావాలన్నా ఆయనకు కమిషన్ ముట్టజెప్తే అయిపోతుందట! ఓ మంత్రికి షాడోగా వైద్యారోగ్య శాఖలో కమిషన్ల దందాకు తెరలేపిన సదరు వ్యక్తి ఎక్కడ బిల్లులు క్లియర్ చేయాల్సి ఉన్నా.. గద్దలా వాలిపోతున్నాడు. బిల్లుకు ఓ రేటు చొప్పున ఫిక్స్ చేసి.. ఎవరి వాటా వారికి ముట్టజెప్పుతూ వైద్యారోగ్యశాఖలో కమిషన్ ‘రాజ్’గా పేరు గాంచాడు. సదరు మంత్రి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఆసరాగా చేసుకుని ఈ దందాలకు తెరలేపినట్టు ప్రచారం జరుగుతున్నది.
ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం రూ.131 కోట్ల చెల్లింపులు చేయాలి. ఇందులో రూ.61 కోట్లు మందులు సరఫరా చేసిన ఏజెన్సీలకు, రూ.70 కోట్లు సివిల్స్ వర్క్స్ చేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంది. బిల్లులను ఆన్లైన్లో సమర్పిస్తేనే నిధులు మంజూరవుతాయి. ఇక్కడే కమిషన్ ‘రాజ్’ ఎంట్రీ ఇచ్చినట్టు ఆరోపణలున్నా యి. ఆన్లైన్లో బిల్లులు సమర్పించేందుకు సదరు ‘రాజ్’ మందులకు 4శాతం, సివిల్ వర్క్స్‌కు 10 శాతం కమిషన్ ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ వ్యవహారమంతా సదరు మంత్రి కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వచ్చిన కమిషన్‌లో నుంచి సదరు మంత్రి, కీలకాధికారికి సైతం పర్సంటేజీ ముట్టజెప్పే ఒప్పందం కుదిరినట్టు విశ్వసనీయ సమాచారం.
ఓ ప్రైవేటు వ్యక్తి వైద్యశాఖలోని పలు విభాగా ల్లో తలదూర్చడం చర్చనీయాంశంగా మారింది. సదరు వ్యక్తికి మంత్రి కుటుంబసభ్యులతో సఖ్యత, కీలకాధికారులతో ఉన్న పరిచయాల కా రణంగా వైద్యశాఖలో పాగా వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఎంఎన్‌జే వ్యవహారంతో తన పేరు మార్మోగినా.. ఎలాంటి భయం, బెరుకు లేకుండా తన పనిని దర్జాగా కొనసాగిస్తున్నాడని వైద్యారోగ్యశాఖ సిబ్బంది చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కమిషన్ల పేరిట వసూళ్ల దందాకు తెరలేపిన సదరు ప్రైవేటు వ్యక్తికి మంత్రి కుటుంబసభ్యుల కంపెనీల్లో భాగస్వామ్యం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది.
వసూళ్ల దందాకు పాల్పడుతున్న సదరు వ్యక్తి గతంలో రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థలో చక్రం తిప్పాలని చూసినట్టు ఆ రోపణలు ఉన్నాయి. తాను చెప్పిన మెడికల్ ఏజెన్సీల బిల్లులు ముందుగా క్లియర్ చేయాలని అధికారులకు హుకుం జారీ చేశాడు. ఈ విషయంలో నిబంధనలకు పాతర వేయాల్సిందే అంటూ రెచ్చిపోయాడు. తమ మాట వినాల్సిందే అంటూ కీలకాధికారిపైనే ఒత్తిళ్లు తీవ్రతరం చేశాడు. తమ తరఫున మెడికల్ ఏజెన్సీల నుంచి వసూళ్లు చేయాలని కింది స్థాయి అధికారిని సైతం బెదిరించినట్టు ఆరోపణలున్నాయి.