దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలు ఒక్కసారిగా పరిష్కారానికి నోచుకుంటాయి. ఏ దిక్కూలేని భూములకు ప్రభుత్వ పెద్దలే పెద్ద దిక్కుగా మారుతారు. 30 ఏండ్ల కిందటి సీలింగ్ ఫైల్ నాలుగు నెలల్లో గట్టెక్కుతుంది. రెండు గ్రామాల సరిహద్దులోని కొన్ని భూములు ప్రభుత్వానివే అంటూ రాత్రికిరాత్రి హైడ్రాకు కల వస్తుంది.. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ‘భూ భారతి’ ఇస్తున్న పరిష్కార చిట్కాలు అనుకున్నారా? అయితే మీరు పప్పులో కాదు.. తప్పులో కాలేసినట్టే! శూన్యం నుంచి కూడా కాసుల మూటలు సృష్టించగల కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేసినట్టే!
నంబర్-2 మంత్రివర్యుల షాడో సీసీఎల్ఏ ఘనత ఇది. దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు వెంటనే పరిష్కారాన్ని కనుగొనాలనే పథకాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేస్తున్నరు. అందులో భాగంగానే రెండున్నరేండ్లుగా అనేక భూ కుంభకోణాలు తెరపైకి వచ్చినయ్. ఈ నేపథ్యంలో కొంతకాలంగా సామాన్య జనాన్ని 22ఏ ఊబిలోకి నెట్టిన సర్కార్ పెద్దలు సందట్లో సడేమియాలా.. తెరవెనుక తమ కార్యాలను చక్కబెట్టుకుంటున్నరు. ‘ఈ పాపం అధికారులదే’నంటూ వాళ్లపైకి నెపం నెట్టి వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములపై అనధికారిక ఒప్పందాలు చేసుకుంటూ సామాన్యుడి చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను ‘హారతి’ కర్పూరంలా చేసి పట్టా భూములుగా మార్చుకొనేందుకు పావులు కదుపుతున్నరు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): పాలనను పక్కన పడేసి, రైతుల భూ సమస్యలను గాలికి వదిలేసి.. భూ దందాలతో జేబులు నింపుకోవడంపైనే కాంగ్రెస్ ప్రభుత్వంలోని ‘ముఖ్యులు’ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా భూ వివాదాలను వెంటనే పరిష్కరించే పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. నంబర్-2 మంత్రి కనుసన్నల్లో నడుస్తున్న షాడో సీసీఎల్ఏ రేయింబవళ్లు రెవెన్యూ రికార్డుల దుమ్ముదులిపి, వేల ఎకరాల కేసులను ముందు వేసుకున్నది. ఇందులో భాగంగానే రెండున్నరేండ్లుగా వందల ఎకరాల ప్రభుత్వ భూములు సర్కార్ పెద్దల ‘భూ హారతి’కి ఆవిరైపోతున్నాయి. అనేక భూ కుంభకోణాలు తెరపైకి వచ్చాయి. వీటన్నింటినీ లోతుగా పరిశీలిస్తే.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వివాదాలు ఒకవంతైతే, ఎక్కువగా ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ వ్యక్తుల మధ్య భూ వివాదాలు కావడం గమనార్హం. సర్కార్ పెద్దలు తెరవెనుక ప్రైవేట్ వ్యక్తులతో మిలాఖత్ అయ్యి ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు. రూ.వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తుల ధారాదత్తానికి సంబంధించి మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవి..
33 ఏండ్ల కిందటి ఫైల్‌పై ‘షాడో’ నజర్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలంలోని రావల్కోల్ సర్వేనంబర్ 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూమి ఉన్నది. దీనిపై 1993 నుంచి సీలింగ్ ఫైల్ పెండింగ్‌లో ఉన్నది. ఇనామ్‌దారు నుంచి భూములు కొనుగోలు చేసిన కొందరికి 1996-97 ప్రాంతంలో అప్పటి ఆర్డీవో ఓఆర్సీలు ఇచ్చారు. దాన్ని 2003లో అప్పటి జేసీ రవిచంద్ర రద్దు చేశారు. అవి పచ్చిక భూములు (గ్రేసరీ ల్యాండ్స్-సాగుయోగ్యం కానివి) అయినందున ఓఆర్సీలు చెల్లవని తీర్పు ఇచ్చారు. దానిపై 2008లో హైకోర్టు తీర్పు ఇస్తూ సమగ్రంగా పరిశీలించాలని సూచించింది. ఆపై 2011లో అప్పటి జేసీ సుదర్శన్‌రెడ్డి తిరిగి ఆర్డీవో సీలింగ్ ప్రక్రియను మొదలుపెట్టాలని మరో తీర్పు ఇచ్చారు. ఆపైనా ఫైలు ముందుకు కదలలేదు. 2022లో హైకోర్టు ఈ అంశాన్ని ఆరు వారాల్లో పరిశీలించాలని ఆదేశించింది. అయినా ఆ ఫైల్ పెండింగ్‌లోనే ఉన్నది. ఈ క్రమంలో ఆ భూమిపై అనేక మంది కొనుగోలుదారులు బయటికొచ్చారు. ఇనామ్‌దారు వారసులపైనా స్పష్టత లేదు.
ఈ క్రమంలో షాడో సీసీఎల్ఏ ఈ అంశాన్ని తెరపైకి తేగా, ‘ముఖ్యనేత’, నంబర్-2 మంత్రితోపాటు మరో మంత్రి తెర వెనుక చక్రం తిప్పారు. ఇందులోభాగంగా ఈ ఏడాది మే 30న ఉద్యోగ విరమణ చేసే రాజేశ్‌కుమార్ అనే ఆర్డీవోకు ఈ ఏడాది జనవరి 8న కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. ఆ వెంటనే ఆయన వరుస విచారణలు నిర్వహించి.. ఉద్యోగ విరమణ చేసే మూడు రోజుల ముందు ‘హైకోర్టు ఆదేశానుసారం సీలింగ్ ప్రక్రియను ముగించాను’ అంటూ ఇనామ్‌దారు వారసుల పేరిట ఐదుగురు వ్యక్తులకు 275 ఎకరాలను ధారాదత్తం చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. విచిత్రమేందంటే.. షాడో సీసీఎల్ఏ తయారు చేసిన ఈ ప్రొసీడింగ్స్‌పై ఆర్డీవో సంతకం చేయడం, నం బర్-2 మంత్రి పేషీ వ్యక్తి నేరుగా వచ్చి ఆ ప్రొసీడింగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం.. వారసులు అంటున్న వాళ్లు హైకోర్టులో కేవియట్ దాఖలు చేయడం చకచకా జరిగిపోయాయి. ‘నమస్తే తెలంగాణ’ ఈ ప్రొసీడింగ్స్‌ను సంపాదించి గుట్టురట్టు చేయడంతో మ్యుటేషన్‌తోపాటు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. మరి ఇందులో ని బంధనలు పాటించారా? అంటే అదీ లేదు.
మే డ్చల్ తహసీల్దార్ ఇనామ్‌దారు వారసులను ధ్రువీకరించడంతోపాటు 1.11.1973 నుంచి ఇప్పటివరకు వాళ్లే భూమిని సాగు చేసుకుంటున్నారని నివేదిక ఇచ్చినట్టు ఆర్డీవో తన ప్రొసీడింగ్స్‌లో పేర్కొన్నారు. కానీ ‘నమస్తే తెలంగాణ’ తహసీల్దార్ నివేదికను పరిశీలించగా సివిల్ కోర్టు నిర్ధారించాల్సిన వారసత్వాన్ని వాళ్లు తనకు సమర్పించలేదని, వారసులు అసలు ఆ గ్రామంలోనే ఉండటం లేదని తన నివేదికలో కుండబద్దలు కొట్టి చెప్పినట్టుగా ఉన్నది. పైగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సీలింగ్ ట్రిబ్యునల్‌కు.. ఫైల్‌ను వెంటనే పరిష్కరించాలని సీసీఎల్ఏ లేఖ రాయడంతో పాటు, అడ్వకేట్ జనరల్ నుంచి కూడా ఈ అంశంపై లేఖ వచ్చాయి. ట్రి బ్యునల్ ప్రభావితం అయ్యిందనేందుకు ఇవన్నీ ని దర్శనాలు. ఇవన్నీ ఒకెత్తయితే అసలు ఇనామ్ భూ ములకు సంబంధించి ఓఆర్సీల జారీపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉన్నా ఆర్డీవో ఓఆర్సీలు జారీ చేయడమూ మరో ఉల్లంఘన. ఇలా అనేక ఉల్లంఘనలతో వచ్చిన ప్రొసీడింగ్స్‌పై గతంలో కొనుగో లు చేసిన వాళ్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ భూముల్ని అమ్మడం, తాకట్టు పెట్టడం చేయొద్దం టూ కౌంటర్ అఫిడవిట్‌కు నోటీసులు జా రీ చేసిం ది. కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు.
ఉద్యోగుల భూమికి ఎసరు

గోపన్‌పల్లి పరిధిలోని సర్వేనంబర్ 36, 37ల్లో దాదాపు 189.11 ఎకరాలను ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఏపీ ఎన్జీవో సంఘానికి ఇండ్ల స్థలాల కోసం కేటాయించింది. 2010లో 125.10 ఎకరాల్లో లేఅవుట్ చేసి, జీహెచ్ఎంసీకి రూ.18 కోట్లు కూడా చెల్లించింది. కానీ ప్లాట్ల పంపిణీలో ఉద్యోగుల మధ్య సీనియారిటీ గొడవలు రావడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇండ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ పెండింగ్‌లో పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీ ఎన్జీవోల స్థానంలో భాగ్యనగర్ (గచ్చిబౌలి) ఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఏర్పాటైంది. ఈ క్రమంలో 2015లో ప్రైవేట్ వ్యక్తులు సర్వేనంబర్ 36లో తమకు 91 ఎకరాల భూమి ఉన్నదంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు తీసుకువచ్చారు.
అయితే.. తహసీల్దార్, ఆర్డీవో క్షేత్రస్థాయి లో పరిశీలించి, ఉద్యోగుల భూమిలో ప్రైవేట్ వ్యక్తులకు 91 ఎకరాల భూమి లేదని తేల్చా రు. ఆ మేరకు అప్పటి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర భుత్వం వచ్చిన తర్వాత ‘షాడో సీసీఎల్ఏ’ రంగప్రవేశం చేసింది. ఈ కేసును తెర మీదికి తీసుకువచ్చింది. సర్కార్ పెద్దల ఆదేశంతో ప్రైవేట్ వ్యక్తుల 91 ఎకరాలు ఉద్యోగుల భూ మిలోనే ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా నివేదికలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ ఏకంగా 91 ఎకరాలకు ఎన్వోసీలు జారీ చేసి, 22ఏ నిషేధిత జాబితా నుం చి తొలగించేందుకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. మ రోవైపు ప్రైవేట్ వ్యక్తులు రంగంలోకి దిగి. సర్వేనంబర్ 37లో దశాబ్దాలుగా ఉన్న బసవతార కం బస్తీవాసులకు రూ.లక్షలు ఆశచూపి గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించారు. వారి కి పోలీసు, రెవెన్యూ అధికారులు అండగా నిలిచారు.
అనంతరం ప్రైవేట్ వ్యక్తులు సర్వేనంబర్ 36లోకి ప్రవేశించి రాత్రికి రాత్రి రోడ్లు వేసి, చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అడిగితే.. గతం లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నామంటూ బుకాయించారు. ఈ భూ కుంభకోణాన్ని ‘నమస్తే తెలంగాణ’ బయటికి తీసుకురావడంతో సర్కార్ పెద్దల గుట్టు రట్టయింది. చివరికి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కలెక్టర్ నుంచి తమకు కేవలం 17.04 ఎకరాల ఎన్వోసీ మాత్రమే అందిందని ప్లేటు ఫిరాయించారు. ఈలోగా ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్ కో ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నది. ఏకంగా రూ.9 వేల కోట్ల భూమిని లక్ష్యంగా చేసుకొని మొదలుపెట్టిన ఈ భూ కుంభకోణం బట్టబయలు కాకపోతే మొత్తం 189.11 ఎకరాలు.. అంటే దాదాపు రూ.20 వేల కోట్ల సర్కార్ భూమికి ఎసరు పెట్టేవారు. ఇందులో ఎన్వోసీలకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం షాడో సీసీఎల్ఏ నుంచే వచ్చిందనే ప్రచారం జరుగుతున్నది.
ఈదులకుంటలో దాగుడు మూతలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి మండలానికి చెందిన 1002 నుంచి 1006 వరకు సర్వే నంబర్లలో 17.12 ఎకరాల భూమి ఉన్నది. ఇది కూకట్పల్లి, శేరిలింగంపల్లి మండలంలోని ఖానామెట్ గ్రామాల సరిహద్దులో ఉంటుంది. ఈ భూమిని దశాబ్దాల కిందటే ఒక నిర్మాణ కంపెనీ ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేసింది. చివరికి దాన్ని సీలింగ్ సర్ప్లస్ భూమిగా నిర్ధారించారు. దీంతో 2008లో సదరు దరఖాస్తుదారులు నిబంధనల మేరకు రూ.9.27 కోట్లు చెల్లించడంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ 26.3.2008 తేదీన జీవో నం.469 జారీ చేసింది. రెవెన్యూ అధికారులు స్వయంగా ఆ భూమిని కంపెనీకి అప్పగించారు.
ఆ తర్వాత 3.35 ఎకరాల్లో ‘విష్ణు విస్తారా’ అనే నివాస సముదాయం నిర్మాణమైంది. మరో 20 గుంటల భూమి రోడ్డు విస్తరణలో పోయింది. దీంతో వారికి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం అది ఓవర్‌ల్యాప్ భూమి అని, అందులో ఈదులకుంట ఉన్నదనే ఫిర్యాదుల నేపథ్యంలో అనేకసార్లు సర్వే జరిగింది. చివరికి అవేమీలేవని పలు శాఖలు ధ్రువీకరిస్తూ పత్రాలు కూడా జారీ చేశాయి. అంతేగాకుండా హైకోర్టులోనూ ఈ వివాదాలపై పిటిషన్లు దాఖలు కావడంతో స్వయంగా ప్రభుత్వ శాఖలు అక్కడ చెరువు లేదని, ఓవర్‌ల్యాప్ భూమి లేదని కూడా అఫిడవిట్లు దాఖలు చేశాయి. జీహెచ్ఎంసీ రూ.7 కోట్లు ఫీజు కింద తీసుకొని నాలుగు సెల్లార్లు, ఒక గ్రౌండ్‌ఫ్లోర్‌కు 7.12.2023న అనుమతులు జారీ చేసింది. చివరికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ భూమిలో నీటి వనరు లేదని, ఓవర్‌ల్యాప్ వివాదం లేదని హైకోర్టుకు విన్నవించింది.
కానీ ఈ భూమిపై స ర్కార్ పెద్దల కన్నుపడటంతో హైడ్రా, రెవెన్యూ అధికారులు అనేకసార్లు అక్కడ జరిగే పనులకు ఆటంకాలు కలిగించారు. దీంతో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్ కో ఆదేశాలిచ్చింది. అయినా హైడ్రా రాత్రికి రాత్రి ఆ భూమిని స్వాధీనం చేసుకొని బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ భూమిని ప్రైవేట్ యాజమాన్యానికి స్వాధీనం చేయాలని, లేకపోతే యాజమాన్యమే స్వాధీనం చేసుకొని అందుకు అయ్యే ఖర్చుల్ని హైడ్రా అధికారుల జీతాల నుంచి చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది.
అంటే ఒకవైపు ప్రభుత్వమే అందులో జలవనరులు లేవని క్లీన్చిట్ ఇస్తూ, మరోవైపు ఆటంకాలు సృష్టిస్తున్నది. రెండు గ్రామాల సరిహద్దులో ఉన్న భూ మిని షాడో సీసీఎల్ఏ తెరపైకి తీసుకురావడం వల్లే హైడ్రా, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారనే ఆరోపణలున్నాయి. లేకపోతే రెండున్నరేండ్లపాటు ఆ భూముల జోలికిపోని అధికారులు ఇప్పుడెందుకు పోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యాజమాన్యంపై సాక్షాత్త్తు నంబర్-2 మంత్రి నుంచి ధమ్కీలు కూడా వచ్చాయనేది బహిరంగ రహస్యం.
బెడిసికొట్టిన క్రషర్ వ్యూహం

నగర శివారులో ఎక్కడెక్కడ వివాదాస్పద, అసైన్డ్ భూములన్నాయనే షాడో సీసీఎల్ఏ అన్వేషణలో తెరపైకొచ్చిన వాటిలో.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములు ఒకటి. కొత్వాల్‌గూడ సర్వేనంబర్ 55-63, 65-68, 70-72ల్లో 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది.
ఈ సర్వేనంబర్లలోని భూమిని 1978లో కొత్వాల్‌గూడకు చెందిన కొంతమంది పేద రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 200 ఎకరాలను అసైన్డ్ చేశారు. అప్పట్లో కొండలు, గుట్టలుగా భూమి ఉండటంతో వ్యవసాయానికి అనుకూలించదంటూ అసైనీలు ఆ భూములను వాడుకలోకి తీసుకోలేదు. దీంతో 2008లో అప్పటి ప్రభుత్వం పీవోటీ యాక్టు ప్రకారం వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నది. అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ భూముల్లో పెద్ద టౌన్‌షిప్స్, కమర్షియల్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో 2008లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ద్వారా ‘దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్’ (దిల్) కంపెనీకి 350 ఎకరాల భూమిని కేటాయించింది.
కానీ దిల్ కంపెనీ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోలేక పోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిరుపయోగంగా ఉన్న ఈ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నది. అప్పటి నుంచి ఈ భూములన్నీ రెవెన్యూ రికార్డుల్లో సర్కార్/సీలింగ్ సర్‌ప్లస్‌గా కొనసాగుతున్నాయి. ఈ భూములను లక్ష్యంగా చేసుకోవాలని షాడో సీసీఎల్ఏ సూచించడంతో నంబర్-2 మంత్రి టీమ్ రంగంలోకి దిగింది. క్రషర్ ఏర్పాటు ముసుగులో అందులో పాగా వేసింది. పాత రైతుల నుంచి లీజు ఒప్పందం చేసుకున్నారు. పూర్వం వేరేచోట క్రషర్ నిర్మాణానికి ఉన్న అనుమతులను అడ్డం పెట్టుకొని ఈ భూముల్లో పాగా వేశారు.
రెవెన్యూ, ఇతర శా ఖల అధికారులు ఆ దరిదాపుల్లోకి రాకుండా ఉండే లా అక్కడ కంటెయినర్‌పై ‘రాఘవ కన్స్ట్రక్షన్స్’ పే రు రాశారు. మౌనం వహించాలంటూ అధికారుల కు మౌఖిక ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. కా నీ బీఆర్ఎస్ ఈ భూ కుంభకోణాన్ని ఆదిలోనే గు ర్తించి గుట్టు రట్టు చేసింది. చివరికి తప్పని పరిస్థితుల్లో హైడ్రా వచ్చి క్రషర్ నిర్మాణాన్ని తొలగించా ల్సి వచ్చింది. లేకపోతే క్రషర్ కొనసాగింపు ముసుగులో వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో గుట్ట లు కరిగిపోయి. చివరికి ఆ భూములన్నింటినీ చా పలా చుట్టేసి రికార్డులు తారుమారు చేయాలనే ప థకం షాడో సీసీఎల్ఏనే రూపొందించిందనే ఆరోపణలున్నాయి. కానీ వ్యూహం బెడిసికొట్టడంతో ఆ భూముల్ని వదిలేయాల్సి వచ్చింది.
సర్కార్ భూమిలో ఆకాశహర్మ్యాలు

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 27లో సుమారు 64.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. 1954-55 ఖాస్రా పహాణీతోపాటు 1959-60 సంవత్సరంలోని రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి పొరంబోకు అని పేర్కొని ఉన్నది. వాస్తవానికి 2018లో ధరణిలోనూ ఇదేరీతిన రికార్డుల్లోకి ఎక్కింది. 22ఏ కింద నిషేధిత జాబితాలోనే కొనసాగుతున్నది. ఇందులో 27.18 ఎకరాల భూమి తమదంటూ వారసుల పేరిట ఆరుగురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయినా 2023,డిసెంబర్ 7 నాటికి ఈ భూములు నిషేధిత జాబితాలో ఉండటంతోపాటు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత షాడో సీసీఎల్ఏ దీనిపై దృష్టిసారించడం, ఆపై నంబర్-2 మంత్రి రంగంలోకి దిగడం చకచకా జరిగిపోయాయి. ఒక నిర్మాణ సంస్థ ఏకంగా ఆ భూమిని స్వాధీనం చేసుకున్నది. జీహెచ్ఎంసీ అనుమతులు తెచ్చుకొని 49 అంతస్తులతో ఏడు టవర్లలో సుమారు 59 లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టింది. ఈ కుంభకోణాన్ని ఎండగడుతూ సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చారు.
అది ప్రభుత్వ భూమి అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. హైడ్రాకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. హైకోర్టులో కేసు కూడా వేశారు. కానీ ఆ తర్వాత అందరూ గప్‌చుప్. హైడ్రా ఆ వంక కన్నెత్తి చూడదు, ఆ నలుగురు ఎమ్మెల్యేలూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఓ నిర్మాణ సంస్థ సర్కార్ భూమిలో ఆకాశహర్మ్యాలు నిర్మించి అమ్ముకుంటుంటే.. సర్కార్ పెద్దలు తమ వాటాలు పదిలం చేసుకొని మిన్నకుండిపోయారు.
వయా కంపెనీలు.. ప్రైవేట్ వ్యక్తులతో మిలాఖత్

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ సర్వేనంబర్ 613లో సుమారు 374 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. 22-ఏ నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూమిగానే వస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో ‘ఏక్యూ స్కేర్ రియల్టర్స్’ అనే ప్రైవేట్ కంపెనీ 374 ఎకరాల చుట్టూ రేకులతో ప్రహరీ ఏర్పాటు చేసింది. శాశ్వత ప్రహరీ నిర్మాణానికి అప్పటి బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్నది.
ఆ గుట్టును ‘నమస్తే తెలంగాణ’ రట్టు చేసింది. దీంతో సర్కార్ పెద్దలు ఉలిక్కి పడి, తెరవెనుక పావులు కదిపారు. ముందుగా ‘మేఘా ఇన్ఫ్రా’ బోర్డు తగిలించారు. ఆ తర్వాత దాన్ని తీసేసి రాఘవ ఇన్ఫ్రాను తెరపైకి తెచ్చారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులను ఆ భూముల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. దీనికి పోలీసు శాఖ పరోక్ష సహకారం అందించగా, రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్ర పోషించింది. ఈ వివాదం పెద్దది కావడంతో ప్రముఖులంతా తడబడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయం వేదికగా మీడియా సమావేశం నిర్వహించి, ‘అది ప్రభుత్వ భూమే.. కానీ గతంలోనే రేకులు వేశారు’ అని సెలవిచ్చారు.
మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ‘అది ప్రైవేట్ భూమి’ అని ధ్రువీకరించారు. ఇంకోవైపు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ‘ఆ భూమిపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నది. ఆలోగా మేము ఆర్డీవోతో సీలింగ్ ప్రక్రియ మొదలుపెట్టించాం’ అని స్పష్టంచేశారు. ఇలా తలోమాట అంటుండగానే.. ప్రైవేట్ కంపెనీ రంగంలోకి దిగి అక్కడ సాగు చేసుకుంటున్న రైతులను బెదిరించి, ప్రలోభ పెట్టి వారిని తరిమేసింది. అడిగితే.. తాము శివరాజ్ బహదూర్ వారసుల నుంచి భూమిని కొనుగోలు చేశామంటూ పత్రాలు చూపించింది. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైన భూమిలో ప్రైవేట్ కంపెనీలు ఎందుకు పాగా వేశాయి? అనేది ప్రభుత్వంగానీ కలెక్టర్‌గానీ సమాధానం చెప్పరు.
మరో విషయం ఏం దంటే.. కందుకూరు ఆర్డీవో సీలింగ్ ప్రక్రియ మొదలుపెట్టినట్టు కలెక్టర్ నారాయణరెడ్డి స్వయంగా ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. అలాంటప్పుడు గతం లో చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చెల్లవని తెలంగా ణ ల్యాండ్ సీలింగ్ యాక్టు-1973 చెప్తున్నది. అ యినా.. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే ప్రైవేట్ కంపెనీ ప్రహరీ కోసం దరఖాస్తు చేసుకోవడం, పరోక్షంగా లేఅవుట్ వేయడం, విక్రయాల కోసం మార్కెటింగ్ మొదలుపెట్టడంపై ఎవరూ నోరు మెదపడం లేదు. ఇక రికార్డులు తారుమారు చేయాలనేది షాడో సీసీఎల్ఏ స్కెచ్ అని తెలుస్తున్నది.
భూ దందాల పరంపరలోనే తెరపైకి 22ఏ భూకంపం
రెండున్నరేండ్లుగా ఇవి కేవలం తెరపైకి వచ్చిన వేల కోట్ల భూ దందాలు మాత్రమే. ఇవే కాకుండా వెలుగులోకి రాని దందాలు కొన్నైతే.. చివరకు ప్రైవేట్ భూముల వివాదంలోనూ తలదూర్చి ‘సెటిల్’ చేసినవి మరెన్నో. ముఖ్యంగా కొన్నిచోట్ల రెండు సంవత్సరాలుగా న్యాయస్థానాల తలుపు తట్టకుండా పైకి మాత్రం ప్రభుత్వ భూములంటూ వివాదాన్ని సృష్టించి చేతులు కాల్చుకున్న లోతుకుంట వంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే ఈ భూ దందాలన్నీ చాలదన్నట్లు ఇప్పుడు సామాన్యుడి ఆస్తుల మీద 22ఏ నిషేధ పిడుగును వేసిన సర్కార్ పెద్దలు ఇంకోవైపు నగర శివారులో సామాన్య సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో ఉన్న విలువైన భూములమీదా కన్నేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, బిగ్ బ్రదర్స్ ఒకరేమిటి! అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇబ్బడిముబ్బడిగా అసైన్డ్ భూములపై అనధికారిక ఒప్పందాలు చేసుకోవడంలోనూ షాడో సీసీఎల్ఏ హస్తం ఉన్నదనే ఆరోపణలున్నాయి. ఎందుకంటే.. నగర శివారులో ఎక్కడెక్కడ విలువైన అసైన్డ్ భూములున్నాయి? ఎంతమంది రైతులున్నారు? వాటికి సంబంధించి రికార్డులను తారుమారు చేసేందుకు ఉన్న అవకాశాలు ఏంది? ఇలా అనేక కోణాల్లో షాడో సీసీఎల్ఏ కేంద్రంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. స్థానికంగా ఉండే నాయకులను రంగంలోకి దింపి నేరుగా రైతులతో అనధికారిక ఒప్పందాలు పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వేలాది ఎకరాల మేర ఒప్పందాలు పూర్తి కాగా.. వాటిని ఎలా తారుమారు చేయాలనే దానిపై రోడ్‌మ్యాప్ కూడా పూర్తయిందనేది సమాచారం. ఆ పరంపరలో భాగంగా కొన్ని రోజుల నుంచి 22ఏ భూకంపాన్ని సృష్టించి.. వాటిని సరిచేసే సాకుతో అసైన్డ్ భూములకు ఎసరు పెట్టేందుకు రంగం సిద్ధమైందనేది రెవెన్యూవర్గాల్లోనే భారీగా చర్చ కొనసాగుతున్నది. దీంతో ఈ భూకంపం యాదృశ్చికం కాదు… పక్కా ప్లాన్ ప్రకారమేనన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. అందుకే మంత్రి పొంగులేటి తప్పు జరిగిందంటూ క్షమాపణలు చెప్తూనే ఆ నెపాన్ని అధికారులపైకి నెట్టడం వెనుక ఆంతర్యమిదేనన్న వ్యాఖ్యలున్నాయి.
బహిర్గతమైన దందాలు కొన్నే.. కానివి మరెన్నో!