MLA Shankar | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ సామాజికవర్గంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వెలమలపై పరుష పదజాలంతో దూషించారు. శంకర్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వెలమ సామాజికవర్గం భగ్గుమంటున్నది. తమ కులంపై పరుషంగా మాట్లాడిన శంకర్‌ను వెంటనే ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ (ఐవా) డిమాండ్ చేసింది. వెలమ సామాజికవర్గంపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యల వీడియో శుక్రవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో శాసనసభ్యుడుగా తన హోదాను మరిచి ఒక వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఐవా మండిపడింది. ఈ వీడియోలో ‘వెలమల్లారా.. మిమ్మల్ని చంపి తీరుతాం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియకుండా వెలమల అంతుచూస్తాం.. కాంగ్రెస్‌లో బలమైన నాయకులం ఉన్నాం.. మేము బయటకొస్తే ఒక్కొక్కరి వీపు విమానాల మోత మోగుతాయి. వెలమల పని పక్కా పడతం.. ఇంకా ఎక్కువ చేస్తే.. డైరెక్ట్‌గా చెప్తున్నా.. షాద్‌నగర్ ఎమ్మెల్యేగా.. నేనే డైరెక్ట్‌గా వెలమలపై భౌతికదాడులకు దిగుతా.. ’ అంటూ ఎమ్మెల్యే శంకర్ హెచ్చరికలు జారీచేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆల్ఇండియా వెలమ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం.. దోమలగూడ పీఎస్‌లో శంకర్‌పై ఫిర్యాదు చేశారు. శంకర్‌పై చట్టపరమైన విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
శంకర్‌పై అనర్హత వేటు వేయాలి : ఐవా డిమాండ్
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన శంకర్‌కు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని, ఆయనపై అనర్హత వేటువేయాలని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హిమాయత్‌నగర్‌లోని ఐవా కార్యాలయంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు నీలగిరి దివాకర్‌రావు, తాండ్ర శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. శంకర్ వాడిన భాష వల్ల వెలమ సామాజికవర్గానికి చెందిన తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే కేవలం తమ కులాన్ని అవమానించినట్టుగా భావించడం లేదని, ఇది తాను చేసిన ప్రమాణాన్ని అవమానించేనట్టేనని పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తికి చట్టసభల్లో ఉండే అర్హత లేదని, ఆయనను వెంటనే ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. వెలమకులాన్ని తిట్టడం ఫ్యాషన్ అయిందని, తమ కులం చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యేగా ఉండి ఏదైనా మాట్లాడొచ్చా? చంపుతామనే భాష ఏమిటి? రౌడీయిజం చేస్తున్నాడా? రాజకీయం చేస్తున్నాడా?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర డీజీపీ తక్షణమే శంకర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెలమ ప్రజాప్రతినిధులు శంకర్ వ్యవహారాన్ని చూస్తూ ఊరుకుంటారా? మీ సహచర ఎమ్మెల్యే మీ ప్రాణాలు తీసినా తీయొచ్చు.. దీనిపై సీఎంను, హైకమాండ్‌ను వెలమ ప్రజాప్రతినిధులు నిలదీయాలి’ అని సూచించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలవంచుకోవాలని, ఇంతటి సంస్కారహీనుడు రాజకీయాలకు పనికిరాడని మండి పడ్డారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే తమ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుందని ఐవా హెచ్చరించింది. సమావేశంలో కోశాధికారి హరీశ్ చేప్యాలతోపాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.