Shadnagar | షాద్‌నగర్, మార్చి7 : అబద్దాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడటం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గత ప్రభుత్వ పనితీరును, మాజీ ఎమ్మెల్యే పనితీరును విమర్శించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన స్థానిక బీఆర్ఎస్ ప్రముఖ నేతలతో కలిసి షాద్‌నగర్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, నేనుకూడ వాళ్లలాగే మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డోస్తుందన్నారు. 65 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిపై చర్చ పెడుదామని, ఎవ్వరి పాలనలో అభివృద్ధి జరిగిందో ప్రజలే చెపుతారని అన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండ మాట్లాడటం వారికే చెల్లిందన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చెప్పే వరకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అంటే ఎవ్వరికి తెలువదని, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పటి పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి ప్రాజెక్ట్‌ను కట్టోద్దని ధర్నా చేసింది నిజం కాదా ? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గానికి రూ. 5.6 వేల కోట్ల నిధులను మంజూరు చేసి టెండర్లను పిలిచారని, ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయని వివరించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో సాగు నీళ్ల కోసం నేను చేసిన ప్రయత్నం, పనులను పూర్తిగా వివరించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. అర్థం లేని మాటలు చెబితే ప్రజలు మెచ్చరని అన్నారు. బీఆర్ఎస్ హాయాంలోనే పాలిటెక్నిక్ కళాశాల మంజూరై, ప్రారంభమైతే మా హాయాంలోనే ప్రారంభమైందని కాంగ్రెస్ నాయకులు చెప్పుకోవడం నిస్సిగ్గుగా ఉందన్నారు.
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచిన చటాన్‌పల్లి ఆర్వోబీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మేము చేసిన అభివృద్ధిని శాఖల వారిగా వివరించేందుకు సిద్దంగా ఉన్నామని, మేము చేసిన అభివృద్ధిపై నిలబడి మమ్మల్నే విమర్శిస్తే ఎలా ? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కొనసాగింపు నిరంతర పక్రియ అని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పనులను కొనసాగించే బాధ్యత ఉంటుందని అభిప్రాయపడ్డారు. పాత జాతీయ రహదారి విస్తరణకు పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేస్తే, ఆ నిధులపై తప్పుడు ప్రచారాలు చేయడం కాంగ్రెస్‌కే చెల్దిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేసేందుకు అవకాశం వచ్చిందని, మా కంటే ఎక్కువగా పనులు చేస్తే మేముకూడ సంతోషిస్తామని అన్నారు. నేడు రైతులు అన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నారని, లో ఓల్టేజీ సమస్యతో బోరు మోటార్లు కాలిపోతున్నాయని, భూ గర్భ జలాలు అడుగంటాయని వాపోయారు. రైతు భరోసా నిధులు లేవు, అందరికి రుణమాఫీ కాక రైతులు ఆర్థిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, కచ్చితంగా చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, సీనియర్ నాయకుడు వంకాయల నారాయణ రెడ్డి, సహాకార సంఘాల మాజీ కార్పోరేషన్ చైర్మన్ రాజావరప్రసాద్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్. నటరాజన్, మండలాల అధ్యక్షులు లక్ష్మణ్‌నాయక్, మురళీధర్‌రెడ్డి, మెండె కృష్ణ, శ్రీధర్‌రెడ్డి, మండలాల నాయకులు పాల్గొన్నారు.