Kamareddy | హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): కామారెడ్డిలో సీఎం కేసీఆర్పై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వెనుకాడుతున్నట్టు తెలిసింది. సీఎం కేసీఆర్ను ఎదుర్కోవడం తన వల్ల కాదని ఆయన పార్టీ అధిష్ఠానం వద్ద మొరపెట్టుకుంటున్నట్టు సమాచారం. తనను కామారెడ్డి నుంచి తప్పించాలని, మరో సీటు కేటాయించాలని కోరుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే సీఎం కేసీఆర్ కామారెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్లో వణుకు పుట్టింది.
తొలుత సీఎం కేసీఆర్ను ఎదుర్కొని, ఆయన్ను ఓడిస్తానని ప్రగల్భాలు పలికిన షబ్బీర్ అలీ ఇప్పుడు మాత్రం తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్పై పోటీ చేస్తే… తాను ఓడిపోవడం ఖాయమని, అప్పుడు పరువు పోతుందని ఆయన అంతరంగికులతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. దీంతో కామారెడ్డి నియోజకవర్గాన్ని వీడాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. రెండో జాబితాలో కామారెడ్డి నుంచి ఆయన పేరు ఉంటుందో లేదో చూడాలని అంటున్నారు.