పీర్జాదిగూడ/రామచంద్రాపురం, సెప్టెంబర్ 17: రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు బాలికలపై లైంగిక దాడులు జరిగాయి. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధిలో మంగళవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతూ బంధువుల వద్ద ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన కేశవరెడ్డి అనే యువకుడు వారి ఇంట్లోకి దూరి గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు సదరు బాలిక తమ బంధువులకు తెలిపింది. దీంతో వారు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సదరు యువకుడు పరారీలో ఉన్నట్టు వారు పేర్కొన్నారు.
ఆర్సీపురం పరిధిలో..
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉండే 17 ఏండ్ల బాలుడు ఇంటి పక్కనే నివాసం ఉంటున్న ఏడేండ్ల బాలిక ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆర్సీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శశికాంత్రెడ్డి బాలుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు.