దుబ్బాక, సెప్టెంబర్ 8: పాఠశాలలో చదువుకునే బాలికపై ముగ్గురు యువకులు లైంగికదాడి చేశారు. బాలిక గర్భం దాల్చడంతో వి షయం బయటకొచ్చింది. బాలిక తల్లి ఫిర్యా దు మేరకు నిందితులపై పోక్సో కేసు నమోదయ్యింది. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కిల్ కార్యాలయంలో ఏసీపీ మధు వివరాలు వెల్లడించారు. దుబ్బాకలోని ఓ బాలిక (9వ తరగతి)పై అదే మండలానికి చెందిన యువకుడు, అక్బర్పేట-భూంపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు కలిసి లైంగికదాడి చేశారు.
మాయమాటలతో బాలికను మోసగించారు. 3 నెలల కిందట బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో వివిధ సమయాల్లో ముగ్గురు యువకులు ఆమె ఇంటికొచ్చి లైంగికదాడి చేశారు. ఇటీవల బాలిక అనారోగ్యానికి గురవడంతో తల్లి సిద్దిపేట జిల్లా దవాఖానకు తీసుకెళ్లింది. అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చిందని నిర్ధారించారు. దీంతో బాలిక తల్లి దుబ్బాక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విచారణ చేసి ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు. బాలికలు, మహిళలకు మాయమాటలు చెప్పి.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.