Telangana | నమస్తే నెట్వర్క్, మే 2: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట తీరని నష్టాలను తెచ్చిపెట్టింది. చేతికొచ్చిన పంట అమ్మే దశలో వర్షంపాలైంది. మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోళ్లు చేపట్టని ఫలితంగా రోజులకొలదీ ఉన్న వరి ధాన్యం, మిర్చి, మక్కలు గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్, ము లుగు జిల్లాలో వర్షం ప్రభావం తీవ్రంగా ఉండగా, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో స్వల్పంగా ఉన్నది.
ధాన్యం రాశులపై పరదాలను కప్పినప్పటికీ బలమైన గాలులతో అవి లేచిపోయాయి. మార్కెట్‌కు తెచ్చిన మిర్చి బస్తాలు తడవగా, మక్కలు కొట్టుకుపోయాయి. అక్కడక్కడా వరి పైరు నేలవాలింది. బొప్పాయి తోటలు ధ్వంసమయ్యాయి. మామిడికాయలు రాలిపోయాయి. ఆరు గాలం కష్టపడి ధాన్యం అమ్ముకునే సమయంలో నష్టపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. కోతకొచ్చిన వరిపొలాలు నేలవాలాయి. మర్రిగూడ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో కోతకు వచ్చిన వరిచేలు నేలవాలాయి. 50 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా. ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో ధాన్యం తడవగా, మరో 10 రోజుల్లో కోయాల్సి ఉన్న మామిడిపండ్లు కూడా ఈదురుగాలులకు నేలరాలాయి.
ఎకరాకు రూ.40 వేల పరిహారమివ్వాలి: మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
హన్వాడ, మే 2: అకాలవర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అకాలవర్షానికి తడుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో శుక్రవారం రైతు సేవా సహకార సంఘం ఆవరణలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రైతులకు సరిపడా గన్నీ బ్యాగులను ఉంచాలని సూచించారు. వర్షాలకు ధాన్యం కొట్టుకుపోతున్నదని వాపోయారు. పాలమూరు ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మంథని మార్కెట్లో కొట్టుకుపోయిన ధాన్యం
పెద్దపల్లి జిల్లాలోని వివిధ గ్రామాల్లో గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వరి, మిర్చి చేన్లతోపాటు మామిడితోటలు దెబ్బతిన్నాయి. మంథని వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. మండలంలోని ఆరెంద, గోపాల్పూర్, చిన్న ఓదెల, ఎక్లాస్‌పూర్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వివిధ గ్రామాల్లో కొత దశలో ఉన్న వరి పంట నేలవాలింది. అలాగే ముత్తారం మండలం ఖమ్మంపల్లిలో తీర్థాల మల్లయ్య, ఉగ్గే మల్లకకు చెందిన ధాన్యం కొట్టుకుపోయింది. మల్లయ్య మూడెకరాల ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా, సుమారు రెండెకరాల ధాన్యం కొట్టుకుపోయింది. ఉగ్గే మల్లకకు చెందిన ఎకరం ధాన్యం కాస్త మట్టిలో కొట్టుకుపోయింది. కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు అవుతున్నా.. కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అడవిశ్రీరాంపూర్‌లో ధాన్యం రాశులు తడిసిపోయాయని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో బీభత్సం
మంచిర్యాల జిల్లాలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లోని ధాన్యం తడిసిపోయి రైతాంగానికి తీవ్ర నష్టం జరిగింది. నెన్నెల మండలంలో అక్కడక్కడా వడగండ్లు పడ్డాయి. గంగారం, ఆవుడం, చిన్నవెంకటాపూర్, కొత్తూర్, ఘన్పూర్, చిత్తాపూర్, నెన్నెల, ఘన్పూర్, నందులపల్లి గ్రామాల్లోని మామిడికాయలు రాలిపోయాయి. కోతకు వచ్చిన వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. అక్కడక్కడా ఆర బోసిన ధాన్యం తడిసింది. మందమర్రి మండలం పొన్నారం, ఆదిల్‌పేట, మామిడిగట్టు గ్రామాల్లోని మామిడికాయలు రాలాయి. చెన్నూర్ మండలం కొమ్మెర, పొక్కూర్, ఆస్నాద్, ఎర్రగుంటపల్లి, కిష్టంపేట, ముత్తరావుపల్లి, ఓత్కులపల్లితో పాటు పలు గ్రామాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. నాగాపూర్‌లో వరద ప్రవాహానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం కొట్టుకుపోయింది.
మామిడి నేలరాలి రూ.5 లక్షల నష్టం
మరో 10 రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న బంగినపల్లి మామిడికాయలు గురువారం కురిసిన గాలివానకు రాలిపడ్డాయి. తోటంతా ధ్వంసమైంది. దీంతో రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. కౌలు ఎలా చెల్లించాలి. ఏడాది నా కుటుంబమంతా కలిసి కాపాడుకున్న మామిడితోటకు తీవ్ర నష్టం జరిగింది. ఈ విషయం ఉద్యానవన శాఖ అధికారులకు తెలిపాను. ప్రభుత్వమే నన్ను ఆదుకోవాలి.
– ఎస్కే అలీ, మామిడి కౌలు రైతు, గట్టుసింగారం, ఖమ్మం జిల్లా
నిలిచిన కొనుగోళ్లు.. ముంచిన వాన..
ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే రైతులు అరిగోస పడుతుంటే.. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా చెడగొట్టు వానలు వారిని నిండా ముంచుతున్నాయి. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నా కాంగ్రెస్ సర్కారు పట్టింపులేని తనంతో ఆరుగాలం పంట నీటిపాలై కల్లాల్లో కర్షకుల కన్నీళ్లు పారుతున్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన అకాల వర్షం రైతాంగానికి తీవ్రం నష్టం మిగిల్చింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్‌కు తెచ్చిన మిర్చి బస్తాలు తడిసిపోగా, మక్కలు కొట్టుకుపోయాయి. కోతకొచ్చిన వరి పైరు నేలవాలింది. రాలిన మామిడి కాయలను.. ధ్వంసమైన బొప్పాయి తోటలను.. తడిసిన మిర్చి బస్తాలను.. కొనుగోలు కేంద్రాల్లో వరదకు కొట్టుకుపోయిన వడ్లను చూసి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ధాన్యం తెచ్చిన వెంటనే కాంటా వేసి కొనుగోలు చేసి ఉంటే ఇంత నష్టం జరగకపోయి ఉండేదని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని సర్కారుపై మండిపడుతున్నారు. వడ్లపై కప్పేందుకు కనీసం టార్పాలిన్ కవర్లను కూడా అందుబాటులో ఉంచడం లేదని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రాల్ల్లోనే తడిసిన వడ్లు
గురువారం రాత్రి, శుక్రవారం కురిసిన వడగండ్ల వానతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యపు రాశుల నడుమ నిలిచిన వర్షపు నీరు
వర్షపు నీరు కాదిది.. అన్నదాత కన్నీరు
మహబూబాబాద్ జిల్లా గూడూరులో కురిసిన అకాల వర్షం కర్షకులకు కన్నీరు మిగిల్చింది. మార్కెట్ యార్డుల్లో రోజుల తరబడి నిరీక్షించినా వడ్లు కొనకపోవడంతో వర్షపు నీటిలో మునిగిపోయిన ధాన్యం