హైదరాబాద్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యు త్తు డిమాండ్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఒకేరోజు డిమాండ్ అమాంతం పెరిగి, ఆ వెంటనే తగ్గుతున్నది. పగటిపూట డిమాండ్ పెరిగి రాత్రికి తగ్గుతున్నది. దీంతో గ్రిడ్ నిర్వహణ సమస్యగా మారుతున్నది. పరిస్థితిని అంచనావేయలేక విద్యుత్తు సంస్థల అధికారులు సతమతమవుతున్నారు. డిమాండ్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో గ్రిడ్ నిర్వహణపై అధికారులు దృష్టిపెట్టారు.
శనివారం ఉదయం 8-9గంటల మధ్య రాష్ట్రం లో గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 13,755 మెగావాట్లుగా నమోదైంది. రాత్రికి ఇది ఏకంగా 6 వేల మెగావాట్లకు పడిపోయింది. సోమవారం ఉదయం గరిష్ఠ డిమాండ్ 14,186 మెగావాట్లుగా నమోదై సాయంత్రానికి 7,946 మెగావాట్లకు తగ్గింది. నిరుడు ఇదే సమయంలో గరిష్ఠ డిమాండ్ 13వేల మెగావాట్లుగా నమోదైంది. ఇలా అమాంతం డిమాండ్ పెరగడం, తగ్గడంతో హైవోల్టేజీ సమస్యలు తలెత్తుతున్నాయి.