హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించలేదన్నట్టుగా విద్యాశాఖ వ్యవహారం కనిపిస్తున్నది. 2008 డీఎస్సీలో నష్టపోయిన బాధితులకు కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా ఉద్యోగాలు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1,225 మంది అభ్యర్థులు ఫిబ్రవరి 15నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగున్నర నెలలు దాటినా ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బాధితులు, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఆర్థికశాఖ గత నెల 19న దాదాపు రూ.52 కోట్ల బడ్జెట్‌ను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ గత నెల 31న సూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను ఆదేశించింది. అప్పటి నుంచి 21 రోజులు గడుస్తున్నా వేతనాల పంపిణీపై స్పష్టత లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2008 డీఎస్సీ కాం టాక్ట్ టీచర్ల వేతనాల బిల్లులు చేయాలంటూ కొన్ని జిల్లాల్లో డీఈవోలు ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశా రు. కానీ బిల్లుల్లో స్పష్టత లేకపోవడంతో ఎంఈవోలు అయోమయంలో ఉన్నారు.