Shabad Murders | హైదరాబాదో సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ): షాబాద్‌లో ఆరు వరుస హత్యల ఘటనలో పోలీస్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ వచ్చేలా కొందరు పోలీసులు సహకరించారని ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఉన్నతాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
కాగా, షాబాద్‌లో అధికారుల అక్రమాలపై లోతైన దర్యాప్తు జరుగకుండా ఓ శక్తి అడ్డుపుల్ల వేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు షాబాద్‌లో పోస్టింగ్‌లో ఉన్న ఒకరిద్దరు అధికారులకు బిగ్ బ్రదర్ ఆశీర్వాదాలు ఉన్నట్టు తెలుస్తున్నది. అందువల్లే వారిపై చర్యలు తీసుకోకుండా ఉన్నతాధికారులపై ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. వరుస హత్యల తర్వాత ప్రజలంతా రోడ్డెక్కడం.. తీవ్ర విమర్శలు రావడంతో ఎస్ఐ రమేశ్‌ను సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తున్నది. కొంతకాలంగా సెటిల్మెంట్లకు అడ్డాగా షాబాద్ పోలీస్ స్టేషన్ మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. అయితే ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థతి పోలీస్ శాఖకు ఎదురైంది.
శాంతి భద్రతల పరిరక్షణను గాలికొదిలేసిన కొందరు పోలీసులు ల్యాండ్ సెటిల్మెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. షాబాద్‌లో జరిగిన ఘోర ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నట్టు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బ్రదర్ సిఫార్సుతో వచ్చామనే ధీమా..! వారికి కావాల్సిన పనులు చేసిపెడితే .. ఇక ఏమి చేసినా చెల్లుతుందని.. ఏ అధికారి కూడా తమను ప్రశ్నించరనే భరోసా వారిలో ఉండటంతోనే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఖద్దరు బట్టలతో వెళ్లిన వారికి మాత్రమే ఠాణాలో మర్యాద లభించేందని, సాధారణ ప్రజలను చులకనగా చూసే వారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులతో చెట్టాపట్టాలేసుకొని స్టేషన్ సిబ్బంది సెటిల్మెంట్లలో కీలక భూమిక పోషించే వారని మండిపడుతున్నారు. రాజ్‌కుమార్ విషయంలోనూ ఇదే జరిగిందని చెబుతున్నారు.
లంచాల వ్యవహారంపై అంతర్గతంగా విచారణ జరిపి ఎస్సైని సస్పెండ్ చేసి, సీఐకి చార్జిషీట్‌తో సరిపెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. స్టేషన్ హౌస్ అఫీసర్‌గా ఉన్న అధికారి నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం, అవినీతి వంటి విషయాలపై ఉన్నతాధికారులు క్లీన్‌చీట్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. బిగ్ బ్రదర్ నుంచి ఉన్నతాధికారులపై ఒత్తిళ్ల కారణంగానే సమగ్ర దర్యాప్తును ఉన్నతాధికారులు పక్కన పెట్టేశారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తప్పంతా ఒక ఎస్సైదే అన్నట్టుగా ఈ వ్యవహారాన్ని చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరు ఘోర హత్యలు జరిగినా పోలీసుల లాలూచీ వైఖరి మారకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఘటనపై ప్రజాగ్రహం వెల్లువెత్తినా సమగ్ర విచారణ జరుపకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేందంటూ స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.