కరీంనగర్, మార్చి 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వేములవాడ : కాంగ్రెస్‌పై అసంతృప్తితో బీఆర్ఎస్లో చేరుతున్నవారిపై అధికార పార్టీ నేతలు కక్షగడుతున్నారు. వలసలను ఆపేందుకు పోలీసుల అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లెలో సోమవారం జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఈ నెల 16న రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లెలో గ్రామ మాజీ సర్పంచ్ బూరుగుల నందయ్య, యూత్ అధ్యక్షుడు కట్ట గోవర్ధన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో పలువురు యువకులు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు. ఈ విషయం సోషల్‌మీడియాలో ప్రచారం కావడం తట్టుకోలేకపోయిన కొందరు కాంగ్రెస్ నాయకులు, వలసలను వాపస్ తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
చేరికల సంఖ్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సోమవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సైతం కాంగ్రెస్ నాయకులకు వంతపాడుతూ అత్యుత్సాహం చూపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాజీ సర్పంచ్ నందయ్య ఇంటికి కానిస్టేబుల్‌ను పంపి స్టేషన్‌కు రమ్మన్నారు. కొద్దిరోజుల క్రితమే తన తొంటికి శస్త్ర చికిత్స జరిగిందని చెప్పాడు. ఇదే విషయాన్ని ఎస్ఐకి కానిస్టేబుల్ వివరించాడు. అయినా వినకుండా ఏకంగా పోలీసు వాహనాన్ని పంపి ఆయనను ఠాణాకు తీసుకెళ్లారు. తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు తనపై ఫిర్యాదు వచ్చిందని, ఆధార్‌కార్డు ఇస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారని నందయ్య వాపోయాడు.
హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం : సుంకె
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్టేషన్‌కు చేరుకొని అధికారులతో మాట్లాడారు. పార్టీలు మారినంత మాత్రాన భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని, ఇలాంటివి పునరావృత్తమైతే ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. పోలీసులు కాంగ్రెస్‌కు తొత్తుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.