కొత్తకోట, నవంబర్ 10 : దుస్తులు ఉతకడానికి వెళ్లిన గురుకులం విద్యార్థుల్లో ఒకరు ప్రమాదవశాత్తు భీమా కాలువలో పడి మరణించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ అంజుమ్ కథనం మేరకు.. కొత్తకోట మండలం అమడబాకుల వద్ద హైవే-44 సమీపంలో మైనార్టీ గురుకుల కళాశాలలో మహబూబ్‌నగర్‌కు చెందిన నవీన్ సీఈసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విద్యార్థులు దుస్తులు ఉతుక్కోవడానికి విరామమిచ్చారు. ప్రహరీ లేకపోవడంతో పలువురు విద్యార్థులు బయటికి వెళ్లారు. సాయంత్రం 7 గంటల సమయంలో నవీన్ కాలేజీలో కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు రాత్రి 9 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో కొత్తకోట మండలంలోని సంకిరెడ్డిపల్లి శివారులో భీమా ఫేజ్-2 కాలువలో శవం ఉన్నట్టు గుర్తించిన ఓ రైతు పోలీసులకు సమాచారమిచ్చాడు. మృతదేహాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా దవాఖానకు తరలించినట్టు ఎస్సై ఆనంద్ తెలిపారు. సమీపంలోని ఓ రైస్‌మిల్‌లో సీసీ ఫుటేజీని పరిశీలించగా.. నవీన్ వెంట మరో నలుగురు విద్యార్థులు ఉన్నట్టు తేలింది.
అయితే వనపర్తి దవాఖాన వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఎస్ఎఫ్ఐ, సీపీఎం, డీవైఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకొన్న ఆర్డీవో సుబ్రహ్మణ్యం అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పినా వినకపోవడంతో మైనార్టీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి షఫీఉల్లాకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేస్తామని వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.