నాంపల్లి క్రిమినల్ కోర్టులు, అగస్టు 17 (నమస్తే తెలంగాణ): సంచలం సృష్టించిన ‘సృష్టి’ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాల కేసు విచారణలో పలు కీలకాంశాలు వెలుగుచూశాయి. సరోగసీ చేయలేదని, చిల్డ్రన్ ట్రాఫికింగ్ ద్వారా పిల్లలను కొనుగోలు చేశామని ‘సృష్టి’ యజమాని డాక్టర్ నమ్రత అంగీకరించారు. నేరాంగీకార వాంగ్మూలంలో ఆమె విస్తుపోయే నిజాలను వెల్లడించారు. గోపాలపురం పోలీస్ అధికారులతోపాటు వైద్యాధికారులు జూలై 26న ఉదయం 11 గంటల సమయంలో విజయవాడలోని నివాసంలో తనను అరెస్టు చేశారని, అనంతరం తనను సికింద్రాబాద్ సెంటర్‌కు తరలించడంతో సరోగసీకి సంబంధించిన ఫైళ్లను అధికారులకు చూపించానని చెప్పారు. ఆ సమయంలో నైట్రోజన్ ట్యాంక్‌లో భద్రపరిచిన అండాలను అధికారులు పరిశీలించడంతోపాటు రిసెప్షన్ గదిలో ఉన్న కంపూటర్ను, క్లయింట్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లను జప్తు చేశారని తెలిపారు. 5 హార్డ్ డిస్క్‌లు, 6 ర్యామ్స్, 2 స్మార్ట్ ఫోన్లు (ఐఫోన్-13 ప్రో మ్యాక్స్, వివో ఫోన్), రూ.40 వేల నగదును జప్తుచేసి, సాక్షుల సంతకాలు తీసుకున్నట్టు వివరించారు.
నమ్రత నేరాంగీకార వివరాలు
సికింద్రాబాద్‌లోని రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులను అధికారులు సాక్షులుగా నిర్ణయించి, వారి సమక్షంలో డాక్టర్ నమ్రత వాంగ్మూలం నమోదు చేశారు. రాజస్థాన్‌కు చెందిన సోనియా, గోవింద్ సింగ్ దంపతులు 2024 ఆగస్టులో తనను సంప్రదించారని, అప్పటికే మూడుసార్లు గర్భస్రావం జరిగిందంటూ చికిత్స నిమిత్తం దవాఖానకు వచ్చినట్టు వారు తెలిపారని నమ్రత వెల్లడించారు. సరోగసీ ద్వారా బిడ్డను పొందడం సులభమేనని, ఆ పద్ధతిలో పుట్టిన బిడ్డను డీఎన్ఏ పరీక్ష చేసి అందిస్తామని, అందుకు రూ.30 లక్షలు చెల్లించాలని స్పష్టం చేయడంతో సోనియా దంపతులు వెంటనే ఒప్పుకుని, బ్యాంక్ ఖాతా నుంచి రూ.15 లక్షలు బదిలీ చేశారని, మిగతా రూ.15 లక్షలు సరోగసీ తల్లికి చెల్లించాల్సి ఉంటుందని ఒప్పంద పత్రంలో రాసుకున్నామని వివరించారు. సోనియా చికిత్స నిమిత్తం తొలుత రూ.5 లక్షలు తన ఖాతాకు బదిలీ అయ్యాయని, ఆరోగ్యకరమైన అండాల విడుదల కోసం చికిత్స పేరుతో ఆమెను మోసగించామని తెలిపారు.
ఆ సమయం లో నస్రీన్ బేగం అనే గర్భిణి సంజయ్, నందినీ అనే ఏజెంట్ల కంటపడటంతో వారు ఆమెను ఆరా తీశారని, గర్భాన్ని తొలగించుకునేందుకు నస్రీన్ బేగంను జూబ్లీహిల్స్‌లోని కార్పొరేట్ దవాఖానకు తీసుకొచ్చినట్టు ఆమె భర్త మహ్మద్ అలీ ఆదిక్ ఆ ఏజెంట్లకు చెప్పాడని వివరించారు. దీంతో ఏజెంట్లు ఆ దంపతులకు డబ్బును ఎర చూపారని, బిడ్డను కని తమకు అప్పగిస్తే రూ.70 వేలు ఇస్తామని ఒప్పందం చేసుకొని శాంపిళ్ల కోసమని నిరుడు సెప్టెంబర్‌లో సోనియా దంపతులను విశాఖ కేంద్రానికి రప్పించానని, ఆ సమయంలో సోనియా మరో రూ.5 లక్షలు చెక్ రూపంలో ఇవ్వడంతో ఈ ఏడాది మే నెలలో సరోగసీ బిడ్డను అందజేస్తామని, ఆ సమయానికి మిగిలిన రూ.20.26 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశామని, అంతలోనే మాటమారుస్తూ.. సరోగసీ తల్లి (నస్రీన్) జూన్‌లో ప్రసవిస్తుందని చెప్పామని తెలిపారు.
దీనిపై సోనియా భర్త గోవింద్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారని, విదేశానికి వెళ్లాల్సి ఉన్నందున తన డీఎన్ఏ శాంపిల్‌ను ముందుగానే తీసుకోవాలని కోరారని పేర్కొన్నారు. దీంతో డీఎన్ఏ శాంపిల్ విషయాన్ని దాటవేసి, అబద్ధాలు చెపినట్టు డాక్టర్ నమ్రత అంగీకరించారు. ఈ ఏడాది జూన్‌లో ఏజెంట్ నందిని ప్రసవం కోసం నస్రీన్‌ను విమానంలో హైదరాబాద్ నుం చి విశాఖకు తీసుకువచ్చిందని, ఆ సమయంలో నస్రీన్ భర్త అలీ ఆదిక్ కూడా విశాఖ సెంటర్‌కు చేరుకున్నారని చెప్పారు. ప్రసవం సందర్భంగా నస్రీన్ అదనంగా మరో రూ.3.5 లక్షలు అడుగుతున్నారని గోవింద్‌సింగ్‌కు తెలపగా, చివరకు రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు తెలిపారు. జూన్ 5న నస్రీన్ మగబిడ్డకు జన్మనిచ్చిందని, 3 రోజుల తర్వాత ఆమెకు రూ.70 వేలు ఇచ్చి హైదరాబాద్‌కు పంపేశామని డాక్టర్ నమ్రత చెప్పారు. ఇంకా పలు విషయాలను ఈ సందర్భంగా నింది తురాలు డాక్టర్ నమ్రత వివరించింది.