హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్‌శాఖలో ఇటీవల కల్పించిన ఉద్యోగోన్నతులలో పలు అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమైన పలువురు ఇంజినీర్లు కోర్టును ఆశ్రయించారని, ఏకంగా శాఖ మంత్రిపైనే ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తున్నది. అయితే సెక్రటేరియట్‌లోని పలువురు అధికారుల తీరువల్లే ఈ పరిస్థితి వచ్చిందని జలసౌధ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది. అమాత్యుడినే తప్పుదోవ పట్టిస్తున్నారని పలువురు ఇంజినీర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వాస్తవంగా ఇరిగేషన్‌శాఖలో 1975 నుంచి నియమితులైన వారెవరికీ ప్రమోషన్లు లేకుండాపోయాయి. అంతా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) స్థాయి పే స్కేళ్లతోనే ఈఎన్సీలుగా, సీఈలుగా, ఎస్ఈలుగా, ఈఈలుగా పనిచేశారు. ఆ హోదాలోనే విరమణ పొందారు. రాష్ట్ర ఏర్పాటు 2014వరకు గల ఇంజినీర్ల సీనియార్టీ జాబితాను ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే రూపొందించి ఇవ్వాల్సి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ సర్కారు ఆ జాబితాను అందివ్వలేదు. ఇప్పటికీ కూడా ఇవ్వలేదు.
మరోవైపు సమస్యకు పరిష్కారం చూపాలని ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు అనేక పర్యాయాలు గత కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిపై సానుకూలంగా స్పందించిన బీఆర్ఎస్ సర్కారు ప్రమోషన్ల అంశానికి సంబంధించి ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రస్తుత ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో అనేక దఫాలుగా చర్చలు జరిపి సీనియార్టీ ఆధారంగా తుది నివేదికను సిద్ధం చేసింది. ఎట్టకేలకు 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్హాక్ ప్రమోషన్లను కల్పించింది. మొత్తంగా 839 మంది డీఈఈలకు ఈఈలుగా, 279 మంది ఈఈలకు ఎస్ఈలుగా, 75మంది ఎస్ఈలకు సీఈలుగా, నలుగురు సీఈలకు ఈఎన్సీలుగా ప్రమోషన్లు ఇచ్చింది. ఇన్చార్జి పోస్టులు లేకుండా హోదాకు అనుగుణంగా పేస్కేళ్లను పొందే అవకాశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదేరీతిలో ఇటీవల ప్రమోషన్లను కల్పించింది. ఒకరు ఈఎన్సీగా, 11మందికి సీఈలుగా, 46 మందికి ఎస్ఈలుగా, 85మందికి ఈఈలుగా, 123మందికి డీఈఈలుగా ఉద్యోగోన్నతిని కల్పించింది. అయితే ఈ ప్రక్రియలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను పాటించకుండా ఇష్టారీతిన ప్రమోషన్లను కల్పించారని పలువురు ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు.
సెక్రటేరియట్‌లోని పలువురు ఉన్నతాధికారులు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను సరిగా అమలు చేయలేదని జలసౌధ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు అనునయులు కోసం కొందరు అధికారులను ప్రమోషన్ల జాబితా నుంచి సైతం తప్పించారని విమర్శిస్తున్నారు. అందుకు అనుగుణంగా సీనియార్టీ జాబితాలను రూపొందించారని, జాబితాలో వెనకున్నవారిని ముందుకు తెచ్చారని, ముందున్నవారిని పక్కనపెట్టారని చెబుతున్నారు. ఇప్పుడు ఇవే ఆరోపణలతో పలువురు ఇంజినీర్లు కోర్టును ఆశ్రయించారు. అయితే ప్రమోషన్లలో చక్రం తిప్పిన కీలక అధికారులను వదిలి ఏకంగా ఇరిగేషన్‌శాఖ మంత్రినే ఈ వ్యవహారం మొత్తానికి బాధ్యులుగా చేసినట్టుగా జలసౌధవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా ఇదేవిషయమై ఇంజినీర్ల తీరుపై మంత్రి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా చర్చకొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన అభినందన సభను రద్దు చేశారు. వాస్తవంగా ప్రమోషన్లు పొందిన అధికారులను సన్మానించాలని భావించారు. ఆదివారం రోజున కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జలసౌధలో ఏర్పాట్లు సైతం చేశారు. అయితే ప్రమోషన్లపై అవతవకలు జరిగాయని పలువురు ఇంజినీర్ల నుంచి ఆరోపణలు రావడంతో ఏకంగా కార్యక్రమాన్ని రద్దు చేసినట్టుగా తెలుస్తున్నది.