Telangana | తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏం సాధించింది? పేదలకు ఆర్థిక భరోసానిస్తూ సంక్షేమంలో జయకేతనం ఎగురవేసింది. చీకట్లను చీల్చి నిరంతర విద్యుత్తుతో పవర్‌హౌస్‌గా మారింది. సాగు, తాగునీటి గోసకు చరమగీతంపాడి జలరాశితో కళకళలాడింది. దండుగ అన్న ఎవుసాన్ని పండుగగా మార్చి 2 కోట్ల ఎకరాల మాగాణంగా నిలిచింది. గ్రామ స్వరాజ్యానికి, పట్టణ ప్రగతికి ఊపిరి లూది అభివృద్ధికి దిక్సూచిగా మారింది. ఐటీలో మేటిగా, కార్ఖానాల అడ్డాగా, బడి, గుడి, దవాఖాన ఇలా రంగమేదైనా ప్రత్యేక ముద్ర వేసింది. అజాత శత్రువుగా, రాజకీయాలకు భీష్మ పితామహుడిగా ఖ్యాతికెక్కిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి కూడా సాధ్యంకాని ఓ అపురూప కలను సాకారం చేసి చూపించింది కేసీఆర్ ప్రభుత్వం. అది కూడా కేవలం తొమ్మిదేండ్లలోనే! వ్యవసాయరంగంలో పలు విప్లవాలకు సమగ్ర సూచికగా చెప్పుకొనే ‘రెయిన్బో రివల్యూషన్’ను తొమ్మిదేండ్లలోనే సాకారం చేసి చూపించిన తొలి, ఏకైక రాష్ట్రం తెలంగాణ.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) : సమైక్య పాలనలో కరువు, పేదరికంతో తల్లడిల్లిన తెలంగాణలో ఇప్పుడు వ్యవసాయం పండుగైంది. దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణను రూపొందించడంతోపాటు పక్కాగా అమలు చేస్తున్నది. అందుకే ‘రెయిన్బో రివల్యూషన్’కి కీలకమైన ఏడురంగాల్లో తెలంగాణ ఏటా 13 శాతం వృద్ధితో దూసుకుపోతూ గడిచిన తొమ్మిదేండ్లలో సగటున 117 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒకవైపు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టుల నుంచి చెక్‌డ్యాంల వంటి సూక్ష్మ నిర్మాణాలతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను జల భాండాగారంగా మార్చింది. అదే సమయంలో రైతుబంధు, రైతుబీమా, సమృద్ధిగా ఎరువులు అందించటంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో వ్యవసాయం చేశారు. నీరు ఎక్కడుంటే అక్కడే అభివృద్ధి ఉంటదన్న నానుడిని నిజం చేస్తూ సాగు అనుబంధ రంగాలు కూడా అదే వేగంతో ప్రగతి సాధించాయి. నీళ్లు పుష్కలంగా ఉండటంతో రైతులు పాడి పశువులను భారీగా పెంచటం మొదలు పెట్టారు. అలా శ్వేత విప్లవం సాకారమైంది. రాష్ట్రంలో ఎటుచూసినా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు వేసవిలో కూడా నిండుగా తొణికిసలాడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండటంతో చేపల ఉత్పత్తి అమాంతం పెరిగిపోయింది. గొర్రెల పంపిణీతో మాంసం ఉత్పత్తి అదే స్థాయిలో పెరిగింది. కోడిగుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం తిరుగులేని స్థాయికి చేరుకొన్నది. ఆయిల్‌పామ్ మిషన్ ద్వారా పామాయిల్ ఉత్పత్తిలో మూడేండ్లలోనే అద్భుత అభివృద్ధిని సాధించింది. ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తే ఎంతటి ప్రగతి సాధ్యమవుతుందనేందుకు ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
గులాబీ విప్లవం
ఒకప్పుడు మాంసం దిగుమతులపై ఆధారపడ్డ తెలంగాణ, ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకమే దీనికి కారణం. 2014-15లో రాష్ట్రంలో 5.05 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి కాగా, ప్రస్తుతం అది 10.04 లక్షల టన్నులకు చేరింది.
శ్వేత విప్లవం
పాడి పరిశ్రమకు చేయూతనందించడమే కాదు.. ప్రభుత్వ డెయిరీలకు కొత్త జవసత్వాలు అద్దడం, పాడి రైతులను ప్రోత్సహించడంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి భారీగా పెరిగింది. 2014-15లో 42 లక్షల టన్నుల పాలు ఉత్పత్తి కాగా, ప్రస్తుతం 58 లక్షల టన్నులకు పెరిగింది.
బూడిద రంగు విప్లవం
ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న ఎరువుల కొరత సమస్యపై కేసీఆర్ ప్రభుత్వం మొదటి నుంచి ప్రత్యేక దృష్టిసారించింది. కొనుగోలు, బఫర్‌స్టాక్, స్టోరేజీ, పంపిణీ వ్యవస్థలను సమన్వయం చేసి ఎరువుల కొరతను నివారించింది. 2014-15లో 25 లక్షల టన్నుల ఎరువుల పంపిణీ జరగ్గా.. ప్రస్తుతం ఇది 40 లక్షల టన్నులకు చేరింది.
పసుపు విప్లవం
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహించేందుకు సర్కారు ‘ఆయిల్‌పామ్ మిషన్’ను తెచ్చింది. 2019లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటగా.. తొలి క్రాప్ 2022లో చేతికొచ్చింది. ఇప్పటివరకూ 1.7 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ సాగు పెరిగింది.
నీలి విప్లవం
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీతో నీలి విప్లవం ఊపందుకొన్నది. 2014-15లో 1.5 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తికాగా, ప్రస్తుతం ఇది 4.38 లక్షల టన్నులకు చేరింది. తొమ్మిదేండ్లలో 192 శాతం వృద్ధి నమోదైంది.
వెండి విప్లవం
రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కోడిగుడ్ల వినియోగాన్ని ముందే గుర్తించిన రాష్ట్రప్రభుత్వం, ఆ దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2014-15లో 1,006 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి కాగా, ప్రస్తుతం ఇది 1,725 కోట్లకు చేరింది.
9 ఏండ్లలో 71 శాతం పెరుగుదల నమోదైంది.
హరిత విప్లవం
తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశానికే ధాన్యాగారంగా మారింది. 2014-15లో 68 లక్షల టన్నుల ధాన్యం (వరి) ఉత్పత్తి జరిగితే, 2022-23 నాటికి ఇది 2.6 కోట్ల టన్నులకు చేరింది. అంటే ధాన్యం ఉత్పత్తి 282 శాతం పెరిగింది.
‘రెయిన్బో రివల్యూషన్’కు కేరాఫ్‌గా .. వాజపేయి విజన్.. తెలంగాణ విజయం
దేశ ఆర్థికానికి ఆయువుపట్టయిన వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి 2000వ సంవత్సరం జూలైలో అప్పటి వాజపేయి సర్కారు తొలిసారి జాతీయ వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చింది. హరిత విప్లవం (ఆహార ధాన్యాలు), శ్వేత విప్లవం (పాలు), పసుపు విప్లవం (నూనె, ఆయిల్‌పామ్), నీలి విప్లవం (చేపలు), వెండి విప్లవం (గుడ్లు), గులాబీ విప్లవం (మాంసం), బూడిద రంగు విప్లవాలను (ఎరువులు) కలగలిపి ‘రెయిన్బో రివల్యూషన్’ను (హరివిల్లు విప్లవం) రూపొందించింది. 2020 నాటికి సాధించాల్సిన లక్ష్యాలకు సమగ్ర ప్రణాళిక రచించింది. సాగు, దాని అనుబంధ రంగాల్లో ఏటా 4 శాతం సమ్మిళితవృద్ధి నమోదు లక్ష్యంగా నిర్ణయించింది. కాలం గడిచింది.. ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోనేలేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న ప్రస్తుత ప్రధాని మోదీ కూడా చేతులెత్తేశారు. కానీ, తనదైన లక్ష్యాలతో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం దానిని సుసాధ్యం చేసి చూపించింది.