వినాయక్‌నగర్, ఏప్రిల్ 4:నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాల సభ్యులనుపోలీసులు అరెస్టు చేసి, 34 ద్విచక్రవాహనాలు, రూ.56 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న తొమ్మిది మంది కోసం గాలిస్తున్నారు. నిజామాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ సాయిచైతన్య వివరాలను వెల్లడించారు. నిజామాబాద్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పక్కాగా సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు దాడి చేసి ముఠా సభ్యులను పట్టుకున్నాయని చెప్పారు.
ఆటోనగర్‌కు చెందిన షేక్ ముజీబ్ అహ్మద్, షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రెహాన్లను అరెస్టు చేసి, వారి నుంచి ఐదు ఫోన్లు, రూ.50 వేల నగదు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ ముఠాకు చెందిన సాలూరవాసి షకీల్, ఆటోనగర్‌కు చెందిన షేక్ నజీబ్, మహారాష్ట్ర వాసి సచిన్, ఆరెంజ్ ట్రావెల్స్‌లో పని చేసే రమేశ్ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. మరోవైపు, ఆర్మూర్లోనూ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను సైతం అరెస్టు చేసినట్టు కమిషనర్ తెలిపారు.
మహారాష్ట్ర, హర్యానా రాష్ర్టాలకు చెందిన వారితో సంబంధాలు పెట్టుకుని ఇక్కడ జోరుగా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గట్టడివడ్డ గౌతమ్, దయాల్ సునీల్, జాజు రంజిత్‌ను అరెస్టు చేశామని, వారు కుదువ పెట్టుకున్న 34 బైక్‌లు, 4 ఫోన్లు, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. హర్యాణాకు చెందిన విపుల్మంగ్, మహారాష్ట్ర వాసి బంటు పలాస్, ఆర్మూర్‌కు చెందిన గట్టడి శ్రీకాంత్, బబ్లూ ఠాకూర్, వినాయక్ ఠాకూర్ పరారీలో ఉన్నారని చెప్పారు.