కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 19: దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. మంగళవారం ఏపీలోని అల్లూరి జిల్లాలో పీఎల్జీఏ చీఫ్ హిడ్మా, అతని భార్య మరో నలుగురు హతమవ్వగా, అది జరిగిన 24 గంటల్లోపే తాజాగా, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల వేట కొనసాగుతూనే ఉంది. అదే ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగించిన భద్రతా బలగాలు మరోసారి పైచేయిగా నిలిచారు. మారేడుమిల్లి అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్న క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల విరమణ తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు వారికి సంబంధించిన ఆయుధ, వస్తు సామగ్రి లభించాయి.
టెక్ శంకర్ మృతి
ఎదురుకాల్పుల్లో మృతిచెందిన వారిలో మావోయిస్టు పార్టీ కీలక నేత, టెక్నికల్ సపోర్ట్ ఇన్చార్జి, ఆయుధాలు, మందుపాతర్ల తయారీలో సిద్ధహస్తుడైన మెతురు జోగారావు అలియాస్ టెక్ శంకర్ (ఏరియా కమిటీ సభ్యుడు)తో పాటు ఆ పార్టీ సభ్యులు శమ్మి, అనిత, జ్యోతి, లోకేష్, వాసు, సురేశ్ ఉన్నట్లు ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. అయితే ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కూడా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధ్రువీకరించలేదు. దేవ్ జీ పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతడిని కోర్టులో హాజరుపరచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
హిడ్మా సన్నిహితుడి అరెస్ట్
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే కోనసీమ జిల్లా రావులపాలెంలో హిడ్మాకి అత్యంత సన్నిహితుడైన మధవి హండ అలియాస్ హండ అలియాస్ సరోజ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటపాక మండలం నెల్లిపాకకు చెందిన సరోజ్ మావోయిస్టు వర్గాలకు మద్దతుగా ఉంటూ.. వారికి లాజిస్టికల్ మద్దతుదారుడిగా ఉన్నాడు. కొంతకాలంగా సరోజ్పై నిఘా వేసిన పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు అతడు ఛత్తీస్గఢ్ నుంచి రహస్యంగా ఆంధ్రాలోకి ప్రవేశించడాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.