హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా నియమి తులైన ఏడుగురు న్యాయమూర్తులు దసరా పండుగనాడు ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు హైకోర్టు ఫస్ట్ కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో వారితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ప్రమాణం చేయించారు. తొలుత వారిని నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాల మేరకు వెలువడిన గెజిట్ ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమ చక్రవర్తి చదివి వినిపించారు. తర్వాత వరుసగా.. సీనియర్ జిల్లా జడ్జిలు పెరుగు శ్రీసుధ, డాక్టర్ చిల్లకూర్ సుమలత, డాక్టర్ గురిజాల రాధారాణి, మున్నారి లక్ష్మణ్, నూన్సావత్ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వర్‌రెడ్డి, జ్యుడీషియల్ మెంబర్, ఆదాయ పన్ను శాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలు పట్లోళ్ల మాధవీదేవి హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, కొత్తగా నియమితులైన న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్‌రెడ్డి, సహాయ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ జే రామచంద్రారావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ పీ అశోక్‌గౌడ్ పాల్గొన్నారు.