హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వీ నవీన్‌యాదవ్ తనపై ఏడు క్రిమినల్ కేసులున్నట్టు ఆయనే స్వయంగా ఓ పత్రికకు ఇచ్చిన ప్రకటన ద్వారా వెల్లడించారు. బెదిరింపులు, మోసాలు, అల్లర్లు, విశ్వాసఘాతుకం, నిబంధనల ఉల్లంఘన వంటి నేరాలకుగాను తనపై కేసులు నమోదైనట్టు, ఈ కేసులన్నీ నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నవీన్ యాదవ్.. తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ దురుద్దేశంతోనేనని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఓ రోడ్‌షోల పాల్గొన్న నవీన్‌యాదవ్ ‘నేను ఏ రోజూ తప్పుడు పనులు చేయలేదు. నేనేమైనా రౌడీనా.. గూండానా.. నేనేమైనా తప్పు పనిచేసిన్నా’ అంటూ ముఖ్యమంత్రి సమక్షంలోనే ప్రజలను అడిగారు. ప్రచారంలో ఆయన వ్యాఖ్యలు పత్రికకు స్వయంగా ఇచ్చిన ప్రకటనకు పొంతన లేకపోవడంపై జూబ్లీహిల్స్ ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.
రౌడీయిజం నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన నవీన్‌యాదవ్‌పై పెట్టిన కేసులు రాజకీయపరమైనవి కాదని ఆయనపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లను బట్టి స్పష్టమవుతున్నదని పరిశీలకులు పేర్కొంటున్నారు. భూకబ్జాలు, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్లతో కూడిన ఈ కేసులకు రాజకీయరంగు పూసి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు నవీన్ ప్రయత్నిస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఆయనపై నమోదైన కేసులన్నీ జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన నేరాలకు సంబంధించినవే కావడం గమనార్హం. మరోవైపు నవీన్ యాదవ్ తండ్రి చిన్నశ్రీశైలం యాదవ్, బాబాయ్ రమేశ్యాదవ్లు రౌడీషీటర్లుగా మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదై ఉన్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇతర పార్టీలను బెదిరించడంపై నవీన్‌తోపాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్‌పై కూడా కేసులు నమోదయ్యాయి. ఇటువంటి వ్యక్తి ప్రజాసేవ చేస్తానంటూ ఎన్నికల్లో పోటీ చేయడం ఆందోళనకరమని అంటున్నారు.

అన్నీ నేరాలకు సంబంధించి కేసులే..!
తాను రౌడీని.. గూండాను కాదంటున్న నవీన్ యాదవ్ స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. బెదిరింపులు, అక్రమనిర్బంధాలు, ప్రజల పట్ల దుష్ప్రవర్తనన మోసాలకు సంబంధించిన కేసుల్లో ప్రధాననిందితునిగా ఉన్నారు. బెదిరింపులకు పాల్పడటం, మోసాలు చేయడం, భూకబ్జాలకు పాల్పడటం, నమ్మకంగా ద్రోహం, అక్రమంగా నిర్బంధించి బెదిరించిన ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో అన్నీ నేరాలకు సంబంధించినవే కాగా ఒక కేసు ఇటీవల ఎన్నికల సమయంలో బెదిరింపులకు పాల్పడినందుకు నమోదైంది. కార్మికనగర్-యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ రోడ్డుపై నిమ్జ్మే దగ్గర రూ.4 కోట్లకు పైగా విలువైన 357 చదరపు గజాల ప్రభుత్వస్థలాన్ని బోగస్‌పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారంటూ నవీన్‌పై ఖైరతాబాద్ రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వస్థలాన్నే ఆక్రమించుకునే ప్రయత్నంతో పాటు పలు భూకబ్జా వివాదాల్లో నవీన్ పాత్ర ఉంటుందని నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నది.
ఏడు కేసుల వివరాలు ఇవీ..