చిక్కడపల్లి, నవంబర్ 11 : కొడంగల్ మండలం రోటిబండా తండాపై ప్రభుత్వం చేసిన దాడులను సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవనాయక్ తీవ్రంగా ఖండించారు. మూసీ పునర్జీవానికి ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో ఒక్కరూపాయి వాడినా సహించబోమని హెచ్చరించారు. సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సేవాలాల్ సేన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 వేల ఎకరాల లంబాడీల భూములను లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. అందులు భాగంగానే గిరిజనులపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల ఓట్లతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డికి వారిని మోసం చేయడానికి మనసెలా వచ్చిందని ప్రశ్నించారు.