సియోల్ నుంచి మనం పోయిన తర్వాతనో.. లేదా ఆ తర్వాత రెండు మూడు రోజుల్లో ఒకటో, రెండో పొలిటికల్ బాంబులు పేలుతాయి..
-ఇటీవల దక్షిణ కొరియా టూర్లో మంత్రి పొంగులేటి చెప్పిన మాటలివి
బాంబుల మాట అటుంచితే.. కనీసం తోక పటాక కూడా పేలలేదు.. పొంగులేటి మాటలే నాగుంబాము బిళ్ల లెక్క బుస్సుమని పొంగి గబ్బువాసన వచ్చింది..
– సోషల్ మీడియాలో పేలిన సెటైర్
Telangana | హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ) : దీపావళికి ముందే పేలుతాయన్న పొలిటికల్ బాంబులు కనీసం తుస్సుమని కూడా అనలేదు! దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేలుస్తామన్న పొలిటికల్ బాంబ్ తుపాకీ రాముని తూటా వంటిదేనని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. పొంగులేటి కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్‌లోనూ సంచలనంగా మారాయి. మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో వీటిపై జోరుగా చర్చసాగింది. సమావేశం తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా ‘అగో..దీపావళి ముందు రోజు పేలబోతుంది’ అని ప్రకటించారు.
దీపావళి పండుగ ముగిసినా.. ఎలాంటి పొలిటికల్ బాంబులు పేలకపోవటంతో పొంగులేటి మాటలు డైవర్షన్ పాలిటిక్సే అని అంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫార్మలా ఈ రేస్‌పై దృష్టిపెట్టింది. రేస్ నిర్వహించే కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయించారని ముఖ్యమంత్రే ఆరోపిస్తూ కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్న విషయం తెల్సిందే. పదినెలలుగా ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో కాంగ్రెస్ ముఖ్యులు అనేక వేదికలపై ప్రశ్నించారు.
ప్రస్తుతం పొంగులేటి చెప్పిన దీపావళి బాంబు కూడా ఫార్ములా రేసుకు సంబంధించినదే అయ్యుండొచ్చని ప్రచారం జరిగింది. దీనిపై ఏసీబీకి ఫిర్యాదు చేశామంటూ ప్రభుత్వమే లీకులిచ్చింది. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో నివేదిక తెప్పించుకున్నది. ఆయనకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పుడు అదే అంశాన్ని తెరమీదికి తెచ్చినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో కేటీఆర్ ప్రమేయం ఎక్కడా లేకున్నా, ఆధారాలు లేకున్నా ఎలా ముందుకు వెళ్తామని ఈ రేస్ కేసును పక్కన పెట్టినట్టు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని.. బీఆర్ఎస్ నేతలు కోట్లు దోచుకున్నారని ఎన్నికల ముందు నుంచే రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అధికారంలో వచ్చిన వెంటనే దీనిపై విచారణ కమిషన్ వేశారు. ఈ కమిషన్ నుంచి ఎలాంటి నివేదిక రాకుండానే దీపావళి బాంబు అంటూ ప్రకటించడం కుట్రలో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా తుదిదశకు చేరుకున్నదని.. ఈ విషయంలోనూ చర్యలుంటాయన్న ప్రచారం సాగింది.
కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకే వారి రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ధరణికి సంబంధించి కూడా బీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా చూపకుండా ఎలా చర్యలు తీసుకుంటారని, అందుకే పొంగులేటి బాంబులు పేలలేదన్న చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా కొనసాగుతున్నది.