Hyderabad | లంచం కోసం చెయ్యిచాచే ఉద్యోగులను చూశాం. కానీ తొలిసారి లంచమిచ్చినవారిని వెతుక్కుని మరీ డబ్బులు వాపస్ చేసే చూస్తున్నాం. సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు జరుపుతున్న వరుస దాడులతో అవినీతిపరుల గుండెల్లో గుబులు పుట్టడమే అందు కు కారణం. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ ఎస్సై కొద్దిరోజులక్రితం ఓ దుకాణ యజమాని తనకు లంచంగా ఇచ్చిన 15 వేలను తిరిగి ఇచ్చేయడం చర్చనీయాంశమవుతున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ‘పైసలు లేనిదే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావు’ అనే నానుడి ఉన్నది. ఆ నానుడిని నిజం చేస్తూ ఎందరో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచానికి అలవాటుపడ్డారు. ఇటీవల కాలంలో మరీ రెచ్చిపోతున్నట్టు వరుస ఏసీబీ దాడులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం ఏదో ఒకచోట ఏసీబీ అధికారులు దాడులకు దిగుతున్నారు. ఫలితంగా లంచాలకు మరిగిన వారిలో భయం కలిగింది. తమపై ఎక్కడ ఫిర్యాదు చేస్తారోననే గుబులుతో తీసుకున్న లంచం సొమ్మును ఇచ్చిన వ్యక్తులకే తిరిగిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పనిచేసి మరోచోటుకు బదిలీ అయిన ఓ ఎస్సై ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఓ దుకాణ యజమాని నుంచి గతంలో తీసుకున్న రూ.15 వేల లంచం సొమ్మును అతన్ని వెతికి మరీ అతడున్న చోటుకే వెళ్లి ఆ ఎస్సై తిరిగివ్వడం గమనార్హం.
‘సార్ మీరెక్కడున్నారు? మిమ్మల్ని ఓ సారి కలవాలి! నేనొస్తా సార్.. నోనో నేనే మీ వద్దకు వస్తా.. ప్రస్తుతం మీరెక్కడున్నారో చెప్పండి చాలు’ అంటూ దుకాణ యజమానికి ఆ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇటీవల వచ్చిన ఫోన్‌కాల్ ఇది. ఆ ఎస్సై మాట కాదనలేక ఆ దుకాణం యజమాని మలక్‌పేట్‌లో ఉన్నానంటూ చెప్పారు. గంట వ్యవధిలోనే సదరు ఎస్సై అతనిని వచ్చి కలిశాడు. కుటంబ మంచిచెడ్డలు, వ్యాపార బాగోగుల గూరించి కొద్దిసేపు మాట్లాడాడు. ఆ తర్వాత తన జేబులో నుంచి రూ.15 వేలు తీసి, సదరు దుకాణ యజమాని చేతిలో పెట్టాడు. నా మాట కాదనకండా మీరిచ్చిన డబ్బు వెనక్కి తీసుకోండి. మీకు నేను ఎలాంటి సహాయం చేయలేకపోయానంటూ ఆ వ్యాపారికి ఎస్సై నచ్చజెప్పి వెళ్లిపోయాడు. అయ్యో ఏంది సార్ ఇది.. అని అంటుండగానే ఆ ఎస్సై అతని మాట వినకుండా తానొచ్చిన బైక్‌పై వెళ్లిపోయాడు.
హైదరాబాద్ వెస్ట్‌జోన్ పరిధిలో నిరుడు చివరలో ఒక స్పా సెంటర్ నిర్వాహకులకు, ఆ ఇంటి యజమానికి ఏర్పడిన వివాదం పోలీస్‌స్టేషన్ దాకా వెళ్లింది. ఇరు పార్టీలతో ఏసీపీ, సీఐలు మాట్లాడారు. ఆ కేసు దర్యాప్తు జరుపుతున్న ఎస్సై మాత్రం బాధితులతో మంచిగానే ఉంటూ, ఖర్చుల కోసం ఎంతో కొంత ఇవ్వాలంటూ తన సిబ్బందితో విషయాన్ని ఫిర్యాదుదారులకు చేరవేశాడు. దీంతో వారు ఒక ఎస్సైకి రూ.15 వేలు లంచం అందజేశారు. ఆ కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. విచారణ జరుగలేదు, ఫిర్యాదుదారుకు న్యాయమూ జరుగలేదు. కొన్నిరోజుల తర్వాత ఆ ఎస్సై అక్కడి నుంచి బదిలీ అయ్యాడు. ఏసీబీ దాడులు, అధికారులు హెచ్చరికలతో జంకిన ఆ ఎస్సై రూ.15 వేలు లంచంగా ఇచ్చిన వ్యక్తిని వెతికి మరీ తిరిగి ఇచ్చేయడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.