హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ‘ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై)’ ఆరోగ్య పథకం కింద లక్షలాది పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలను అందిస్తున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఊదరగొడుతున్నది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఈ మాటలనే వల్లె వేస్తున్నది. అయితే, మోదీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారమంతా ఉత్తదేనని తేలింది. ‘ఆయుష్మాన్ భారత్’ కింద విడుదల చేయాల్సిన బకాయిలు అంతకంతకూ పేరుకుపోతున్నాయని, దీంతో ప్రైవేటు దవాఖానల్లో పేద రోగులకు సేవలు దూరమవుతున్నాయని తెలిసింది. నేషనల్ హెల్త్ అథారిటీకి.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఇటీవల సమర్పించిన శ్వేత పత్రంలోనూ ఇదే విషయం తేలింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద చెల్లింపులు ఆలస్యమవుతున్నాయని, దేశవ్యాప్తంగా ప్రైవేటు దవాఖానలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము రూ.1.21 లక్షల కోట్ల మేర పేరుకుపోయినట్టు ఐఎంసీ తెలిపింది. బకాయిలు పేరుకుపోవడంతో పలు ప్రైవేటు దవాఖానలు పేద, మధ్య తరగతి రోగులను చేర్చుకోవడం లేదని, మరికొన్ని చోట్ల రోగుల నుంచే డబ్బులను వసూలు చేస్తున్నాయని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ ఫలాలు అటకెక్కాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎంతమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హర్యానాలో అలా.. మణిపూర్‌లో ఇలా..
బకాయిలు చెల్లించలేదన్న కారణంతో బీజేపీ పాలిత హర్యానాలో దాదాపు 650 ప్రైవేటు దవాఖానలు ఆయుష్మాన్ భారత్ సేవలను నిలిపేశాయి. రూ. 490 కోట్ల బిల్లులను విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఐఎంఏ హర్యానా కార్యదర్శి ధీరేందర్ కే సోనీ ఆరోపించారు. పెండింగ్ బిల్లులను విడుదల చేయకపోతే ఆగస్టు 16 నుంచి మణిపూర్‌లోని ప్రైవేటు దవాఖానల్లో ఆయుష్మాన్ సేవలను నిలిపే యనున్నట్టు ఆ రాష్ట్ర ఐఎంఏ ప్రతిని ధులు హెచ్చరించారు. ప్రభుత్వ దవాఖానల్లో వసతులు లేకపోవడంతో ఆయుష్మాన్ లబ్ధిదారులు ప్రైవేటు దవాఖానలకు వెళ్తున్నారు. అయితే, ఇప్పుడు అక్కడ కూడా సేవలను నిలిపేస్తుండటంతో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
అక్రమాలకు అడ్డా..
పెండింగ్ బిల్లులే కాదు.. అవకతవకలకు అడ్డాగా, అక్రమార్కులకు ఆదాయ వనరుగా ‘ఆయుష్మాన్ భారత్’ పథకం మారింది. వాడుకలో లేని ఒకే ఫోన్ నంబర్‌పై (9999999999) ఈ పథకం కింద ఏకంగా 9,85,166 రిజిస్ట్రేషన్లు జరిగాయంటే స్కీమ్ అమలులో ఎన్ని లోటుపాట్లు జరుగు తున్నాయో అర్థమవుతున్నది. ఈ మేరకు 2023లో కాగ్ పార్లమెంట్లో ఓ నివేదికను సమర్పించింది. పథక లబ్ధిదారుల జాబితాలో అవాస్తవిక పేర్లు, తప్పుడు పుట్టిన తేదీలు, డూప్లికేట్ పీఎంజేడీవై ఐడీలు, కుటుంబ సభ్యుల సంఖ్యలో తేడాలు గుర్తించినట్టు కాగ్ తెలిపింది.
కాగ్ నివేదిక-2023 ప్రకారం ఈ పథకంలో అక్రమాలు ఇలా..
ఇదీ ఆయుష్మాన్ స్వరూపం
ఆధారం: కాగ్ నివేదిక-2023 ఒక్క ఫోన్ నంబర్‌తో ఎన్ని రిజిస్ట్రేషన్లంటే మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ల సంఖ్య