కామారెడ్డి, జూలై 27: చిన్నపాటి తగాదాలను కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్ (సీఎంవీ)ల ద్వారా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్ తెలిపారు. ఇందుకోసం మీడియేషన్ యాక్ట్-2023ను ప్రభుత్వం తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. సామాజిక స్పృహ, సేవాభావం కలిగిన కొంతమందిని వలంటీర్లుగా ఎంపిక చేస్తున్నామని చెప్పారు. వీరంతా సామాజిక బాధ్యతతో తగాదాల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. శనివారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నచిన్న తగాదాలతో పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లి సమయం, డబ్బు వృథా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. హైకోర్టు న్యా యమూర్తి జస్టిస్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ సామాజిక కార్యకర్తలు, పెద్దమనుషుల సమక్షంలో తగాదాలను పరిష్కరించడానికి కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లు పనిచేయాలని సూచించారు.
కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా సమస్యలు పరిష్కారమైతే సమాజంలో మంచి వాతావరణం ఏర్పడుతుందని, అందుకోసం వలంటీర్లు కృషి చేయాలని కోరారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ఆవరణలో హైకోర్టు న్యాయమూర్తులు మొక్క నాటి నీరు పోశారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ పంచాక్షరీ, కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్, అడిషనల్ జిల్లా న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస్‌నాయక్, సీనియర్ సివిల్ జడ్జి, సెక్రటరీ నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, ఎస్పీ సింధూశర్మ పాల్గొన్నారు.