లింగంపేట, జూన్ 24 : సర్వర్ సమస్యలతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మంగళవారం తీవ్ర అంతరాయం కలిగింది. భూభారతి చట్టం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోనూ సర్వర్ సమస్యలు తలెత్తాయి. దీంతో రైతులు పొద్దంతా అక్కడే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
ఇక్కడ దాదాపు వందకుపైగా స్లాట్లు ఇప్పటికే బుక్ అయి ఉండగా, మంగళవారం మూడు మాత్రమే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అటు నాగిరెడ్డిపేట్ మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. సర్వర్లు మొరాయిస్తుండటంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆఫీసు ఆవరణలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడ మంగళవారం 25 స్లాట్లు బుకింగ్ కాగా, అందులో సగం కూడా రిజిస్ట్రేషన్లు కాలేదు.