ORR | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ ప్లాజాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వాటి నిర్వాహకుల నిర్లక్ష్యంతోపాటు నిత్యం తలెత్తుతున్న సాంకేతిక సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఫాస్టాగ్ ఖాతాల నుంచి అడ్డగోలుగా డబ్బులు కట్ అవుతున్నాయని వాపోతున్నారు. దీంతో ఓఆర్ఆర్పై టోల్ వసూళ్లలో ఏం జరుగుతున్నదో అంతు చిక్కడం లేదు.
తరుచుగా సాంకేతిక లోపాలు
దాదాపు 160 కి.మీ. పొడవైన ఓఆర్ఆర్పై మొత్తం 19 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో నిత్యం ఏదో ఒక టోల్ ప్లాజా వద్ద సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఫాస్టాగ్ లైన్లను ఏర్పాటు చేసినప్పటికీ నెట్‌వర్క్‌లో లోపాల వల్ల అదనపు చార్జీల భారం పడుతున్నదని, నిబంధనలకు అనుగుణంగా టోల్ వసూళ్లు జరగడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో రౌండ్ ట్రిప్ ప్రయాణానికి 50% మినహాయింపు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఫాస్టాగ్ చెల్లింపుల సందర్భంగా రేడియో ఫ్రీక్వెన్సీలో తలెత్తుతున్న లోపాలను టోల్ నిర్వహకులు సవరించడం లేదని, అక్రమంగా వసూలు చేస్తున్న అదనపు చార్జీలపై ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం లేదని మండిపడుతున్నారు. టోల్ ప్లాజా కస్టమర్ కేర్ నంబర్లు సరిగా పనిచేయడం లేదని, ఇంత జరుగుతున్నా అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యానికి రూ.30 వేలు మూల్యం
ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల్లో నిర్వహకుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. రామాంతపూర్‌కు చెందిన రాజ్‌కుమార్ గుమ్మి అనే వాహనదారుడు నిరుడు నవంబర్‌లో ఓఆర్ఆర్పై ప్రయాణించాడు. వెళ్లేటప్పుడు రూ.20 చెల్లించగా.. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఆయన ఫాస్టాగ్ ఖాతా నుంచి రూ.10 బదులుగా రూ.90 వసూలు చేశారు. 24 గంటల వ్యవధిలో చేసే రౌండ్ ట్రిప్‌కు చార్జీలో 50% రాయితీ ఇవ్వకపోగా అదనంగా రూ.80 కట్ చేశారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేయడంతో వినియోగదారుల ఫోరం తీవ్రంగా స్పందించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు టోల్ ప్లాజా నిర్వహకులకు ఏకంగా రూ.30 వేల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని నిర్ణీత గడువులోగా బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.