హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): జైళ్లశాఖలో నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. పట్టించుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తుండటంతో వరుస దుర్ఘటనలు జరుగుతున్నాయి. హోంశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది. హోంశాఖ కూడా సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలోనే ఉండటంతో జైళ్లశాఖలో పరిపాలన నత్తనడకన సాగుతున్నది. సెంట్రల్, డిస్ట్రిక్ట్, సబ్ జైళ్లలో పూర్తిస్థాయి అధికారులు కూడా లేకపోవడంతో పరిస్థితులు అధ్వానంగా మారాయని అధికారులే వాపోతున్నారు. ఉన్నతాధికారి విపరీత ధోరణితో వేగలేకపోతున్నామని నిట్టూరుస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే జైళ్లశాఖలో పరిస్థితి పూర్తిగా చేజారిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జైళ్ల దుస్థితి గురించి అధికారులే ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారంటే సమస్యల తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
పట్టించుకోని సర్కార్..పారిపోతున్న ఖైదీలు
తెలంగాణలోని రెండుప్రధాన జైళ్లతోపాటు జిల్లా, సబ్‌జైళ్లలో ఇన్చార్జుల పాలన అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో 11 జైళ్లలో ఇన్చార్జుల పాలన నడుస్తుందంటే పర్యవేక్షణ ఎంత అధ్వానంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. జైళ్లలో సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తున్నది. ఉదాహరణకు 140 మంది సిబ్బంది ఉండాల్సిన చర్లపల్లి కేంద్ర కారాగారంలో సగానికి పైగా ఖాళీలు ఉన్నాయని, మిగతా జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉన్నదని అధికారులు చెప్తున్నారు. జైళ్లశాఖ డీజీకి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎనిమిది నెలలుగా ఉద్యోగోన్నతులు పెండింగ్‌లో పెట్టారని చెప్తున్నారు. జైళ్లలో నిఘాలోపాన్ని ఆసరాగా చేసుకుని ఖైదీలు పారిపోవడం, పారిపోయేందుకు యత్నించడం పరిపాటిగా మారింది. ఇటీవల చర్లపల్లి సెంట్రల్ జైల్ నుంచి ఇద్దరు ఖైదీలు రోజుల వ్యవధిలోనే పారిపోయారు. ఆసిఫాబాద్, పరకాల, సత్తుపల్లి నుంచి కూడా ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జైళ్లలోని సీసీ కెమెరాలు చాలాచోట్ల పనిచేయకుండా అంకారప్రాయంగా మారిపోయాయి.
సిబ్బందికి పైసలిస్తే అన్నీ నడుస్తయి!
అధికారులు, సిబ్బంది చేతులు తడిపితే జైళ్లలోకి ఏదైనా తీసుకెళ్లొచ్చు అని ఖైదీలు, వారి బంధువులు నిరూపిస్తున్నారు. జైలులో ఉన్నా రాజభోగాలు అనుభవించడానికి సిబ్బంది అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఖైదీలు కోరిన ప్రత్యేక వసతులు కల్పించేందుకు లంచం మొత్తాన్ని ఫోన్‌పే చేయించుకున్న వైనం చర్చనీయాశమైంది. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలోనూ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. ఖైదీలు జైలు లోపలికి వెళ్లేటప్పుడే గంజాయి వెంట తీసుకెళ్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. పలువురు ఖైదీలు దవాఖానలకు వెళ్లినప్పుడు గంజాయి సేవిస్తున్నారు. అడ్డుచెప్తే జైలు సిబ్బందిపై దాడులు చేస్తున్నారు. ఖైదీలు అనుమానాస్పదంగా మరణిస్తున్నా, ఆత్మహత్యలు చేసుకుంటున్నా సంరక్షణ, పర్యవేక్షణలో అధికారులు శ్రద్ధ వహించడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
జైలు సిబ్బంది ఆరోగ్యం గాలికి
పోలీసుశాఖలో అమలు చేస్తున్న ‘ఆరోగ్య భద్రత’ పథకాన్ని జైళ్లశాఖలోనూ అమలు చేస్తామంటూ నిరుడు ఆగస్టులో హోంశాఖ జీవో జారీ చేసింది. జీవో అమలు కోసం క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు సుమారు 1,600 మంది ఎదురుచూస్తున్నారు. వైద్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం, హోంశాఖ నిర్లక్ష్యంపై సిబ్బంది తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరంగల్‌లో సంగారెడ్డి జైల్ వార్డెర్ రాకేశ్ రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరోగ్య భద్రత అమలు చేసి ఉంటే రాకేశ్ కుటుంబానికి సుమారు రూ.కోటి పరిహారం వచ్చేది. కానీ రాకేశ్ కుటుంబానికి జైలు సిబ్బంది తలా రూ.వెయ్యి చొప్పున జమ చేసి, కొంత మొత్తం సాయం అందించారు. వైద్య ఖర్చులకు రీయింబర్స్ చేయడంలోనూ ఇబ్బందులు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.