Tiger | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల్లో పెద్ద పులులు దడపుట్టిస్తున్నాయి. వరుస దాడులతో అటవీ ప్రాంతవాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) మండలం చీటిపల్లిలో ఆవుదూడపై పులి దాడి చేసింది. సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పులి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టారు. కాగా, అటవీ, వన్యమృగాల సంరక్షణ, ప్రజల రక్షణ విషయంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల అధికారుల మధ్య సమన్వయం కొరవడినట్టు ఆరోపణలున్నాయి.
అప్రమత్తం కావాల్సిన అటవీ శాఖ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు. పులుల కదలికలను గుర్తించి, ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేస్తూ, వాటిని కవ్వాల్ అభయారణ్యంలోకి దారి మళ్లించటంపై శాస్త్రీయ ప్రమాణాలు పాటించే ప్రయత్నాలు చేయడం లేదని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, నవంబర్ 30న కాగజ్నగర్ మండలం గన్నారంలో మోర్లే లక్ష్మిని హతమార్చిన పెద్దపులి ఆ ప్రాంతంలోనే సంచరిస్తుందన్న ప్రచారం స్థానికుల్లో వణుకు పుట్టిస్తున్నది.