హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సమరశంఖం పూరించింది. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం, డిమాండ్లను నెరవేర్చకపోవడం, కమిటీల పేరుతో తాత్సారం చేయడం, పైగా అవమానించడం.. అపహాస్యం చేయడంతో విసిగిపోయిన ఉద్యోగులు ఇక ఉద్యమ బాటపట్టారు. సర్కారుపై ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. 42 రోజుల భారీ ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పోరాటం అక్టోబర్ 12న చలో హైదరాబాద్ వరకు కొనసాగుతుందని జేఏసీ నేతలు తెలిపారు. రెండు లక్షల మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కదం తొక్కుతామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అత్యవసర సమావేశం మంగళవారం హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీవోభవన్లో జరిగింది.
దాదాపు 206 సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి, ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచే ఉద్యోగుల, టీచర్ల, పెన్షనర్ల పోరాటం ప్రారంభమవుతుంది. సీపీఎస్‌ను రద్దుచేయాలన్న ప్రధాన డిమాండ్‌పై అన్ని జిల్లాల్లో పెన్షన్ విద్రోహ దినా న్ని పాటించనున్నారు. హైదరాబాద్‌లో అదేరోజు మూడువేల మంది ఉద్యోగులతో భారీ సభను నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 8 నుంచి బస్సుయాత్ర, చలో హైదరాబాద్ నిర్వహిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. 15లోగా తమ సమస్యలను పరిష్కరించాలని జేఏసీ గడువు విధించింది. సీఎస్ కే రామకృష్ణారావును కలిసి నోటీసు అందజేశారు. సర్కారు నుంచి స్పందన కరువవడంతో జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
సెప్టెంబర్ 8 నుంచి బస్సుయాత్ర..
సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. వరంగల్ నుంచి ప్రారంభమయ్యే బస్సుయాత్ర కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల మీదుగా సెప్టెంబర్ 18న ఖమ్మంలో ముగుస్తుందని జేఏసీ నేతలు తెలిపారు. సెప్టెంబర్ 19, 20వ తేదీల్లో మరికొన్ని జిల్లాల్లోనూ బస్సు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలోజేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ పుల్గం దామోదర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు గంగాపురం స్థితప్రజ్ఞ, ఏ సత్యనారాయణ, బీ శ్యామ్, కే వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణగౌడ్, డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి, చావ రవి, సదానందంగౌడ్, కే రమేశ్, ఉమాదేవి, రాధాకృష్ణ, లింగారెడ్డి పాల్గొన్నారు.
ఇంకెప్పుడిస్తరు.. ఇంకెన్నాళ్లు వేచిచూడాలి
ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఆగితిమి, నమ్మితిమి. నెలకు రూ.700 కోట్ల బిల్లులిస్తమని మీరే చెప్తిరి. ఈహెచ్ఎస్ జీవోను అమలుచేస్తమంటిరి. పాత పింఛన్‌ను పునరుద్ధరిస్తమంటిరి. మేం ఉద్యమానికి దిగితే చర్చలకు పిలిస్తిరి. మీవి న్యాయమైన డిమాండ్లే అంటిరి. ఈ 20 నెలల్లో ఒక్కటి కూడా పరిష్కరించకపోతిరి. ఇరవై నెలలు ఓపికపడితిమి. మా సమస్యలు ఇంకెప్పుడు పరిష్కరిస్తరు. ఇక భరించలేం. మా ఓపిక నశించింది. అందుకే ఉద్యమ కార్యాచరణ ప్రకటించినం.
– మారం జగదీశ్వర్, జేఏసీ చైర్మన్
కార్యాచరణను కొనసాగిస్తాం..
మా హక్కులు, రాయితీలు, ప్రయోజనాల కోసం మేం రాజీపడబోం. ప్రకటించిన కార్యాచరణను కొనసాగిస్తం. ఎక్కడా వెనుకడుగేయం. రూ.13వేల కోట్ల పెండింగ్ బకాయిలున్నాయి. రూపాయి ఇవ్వకపోతే మేం ఎవరిని అడగాలి? ప్రభుత్వానికి అమ్ముడుపోయామని, సర్కారుకు తొత్తులుగా మారామని మా ఉద్యోగులే మమ్మల్ని నిందిస్తున్నారు. మాలోని అసంతృప్తి ఆవేశంగా మారకముందే సర్కారు స్పందించి, మా సమస్యలు పరిష్కరించాలి.
-ఏలూరి శ్రీనివాసరావు,జేఏసీ సెక్రటరీ జనరల్
బిచ్చగాళ్లమనుకుంటున్నారా..?
మంత్రులు, అధికారులు మా సమస్యలను పట్టించుకోవడంలేదు. పెండింగ్ బిల్లులు రాక 200-300 మంది ఉద్యోగులు చనిపోయారు. పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగుల బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. కేవలం రూ.26వేల బిల్లు కోసం ఓ క్యాన్సర్ పేషంట్ కొడుకు వాట్సాప్‌లో సార్ ప్లీజ్ అంటూ బతిమిలాడి.. ఆఖరుకు 15 రోజులకు మా నాన్న చనిపోయారని చెప్తే ఏడుపొచ్చింది. ఇంతటి దయనీయ పరిస్థితిలో ఉద్యోగులున్నారు. మేమేమైనా బిచ్చగాళ్లమనుకుంటున్నారా..? మాది ధర్మపోరాటం. మేమంతా నిజాయితీగా పోరాడుతాం. అమరవీరుల సాక్షిగా ఎత్తిన పిడికిలి దించం.
– ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, టీఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శి
ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ
అయినా సర్కారు స్పందించకపోతే అక్టోబర్ 12న మరో విడత కార్యాచరణను ప్రకటిస్తారు. అదే సభలో పెన్‌డౌన్, రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపు