CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘నిజాం సంస్థానాన్ని దేశంలో కలిపిన రోజును విలీన దినోత్సవంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విలీన దినోత్సవంగానే నిర్వహించాలి..’ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి 2022 సెప్టెంబర్‌లో చేసిన వ్యాఖ్యలివి. విలీనం జరిగి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రె స్ తరఫున 2022 సెప్టెంబర్ 17 నుంచి ఏడాదిపాటు ‘విలీన వజ్రోత్సవాలు’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు అధికారం చేపట్టాక మాట మా ర్చారు. ’ప్రజాపాలన దినోత్సవం’ పేరుతో అధికారిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘ప్రజాపాలన’ అనేది అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ నినాదంగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
‘ప్రజాపాలన’ పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది. ఇప్పుడు ఆ పేరునే సెప్టెంబర్ 17 వేడుకలకు వినియోగిస్తుండటంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ పేరుతో వేడుకలు నిర్వహించినప్పుడు తప్పుబట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ‘విలీన దినోత్సవం’ పేరుతో వేడుకలను ఎందుకు నిర్వహించడం లేదని నిలదీస్తున్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ‘విలీన దినోత్సవం’ పేరు తో గాంధీభవన్‌లో జెండా ఎగురవేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నారు. కాంగ్రె స్ మాత్రం విలీన దినోత్సవం పేరుతోనే కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పిన ఆ పార్టీ నేత అద్దం కి దయాకర్.. ఇప్పుడెందుకు ‘ప్రజాపాలన’కు ఓటేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా నిర్వహించాలని గతంలో సీపీఐ డిమాండ్ చేసింది. విలీన దినోత్సవం నిర్వ హించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిరుడు ఆగస్టులో సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. నిరుడు సెప్టెంబర్‌లో హై దరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల్లో పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మా ట్లాడుతూ.. జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించడమంటే తెలంగాణ సాయుధ పో రాటాన్ని నీరుగార్చడమేనని, కనుక సెప్టెంబర్ 17ను ‘విలీన దినోత్సవం’గానే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కానీ, ఇప్పుడు సీపీఐ నేతలంతా ఆ మాటలను మర్చిపోవడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు.