మల్యాల, జూన్ 4: ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండె. ఇప్పటి కూడా ప్రజలంతా ఆయన్నే యాదిచేసుకుంటున్నరు. ఎవరైనా ఆయన్ను ఏమన్నా అంటే పురుగులుపడి చస్తరు’ అంటూ పలువురు రైతులు.. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. బుధవారం ఆయన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రంగాపూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మల్యాల మండలం రాంపూర్‌లోని ప్రధాన బస్టాండ్ చౌరస్తా వద్ద స్థానిక రైతులు అభివాదం చేయడంతో వారు ఆగారు. అనంతరం రైతుల ఆహ్వానం మేరకు వారితో కలిసి టీ తాగారు.
ఈ క్రమంలో రాంపూర్‌కు చెందిన సంఘ ఎర్రన్న అనే రైతు మాట్లాడుతూ.. ప్రజలంతా కేసీఆర్‌నే యాది చేస్తున్నారని, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉందని, మళ్లీ ఆ సారే వస్తడని అభిప్రాయపడ్డారు. మరో రైతు సామ గంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు తన భూమిని సాగు చేసుకునేందుకు పది కరెంట్ మోటర్లు నడిపేవాడినని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత తమ గ్రామంలో సబ్‌స్టేషన్, వరద కాలువపై పంప్‌హౌస్ నిర్మాణంతో నీటి నిల్వలు పెరిగాయని తెలిపారు. సాగునీరు, నాణ్యమైన విద్యుత్తు ఉండటంతో పది మోటర్ల స్థానంలో మూడు మోటర్లను మాత్రమే నడుపుతున్నట్టు పేర్కొన్నారు. తమకు ఈ యాసంగి పంటకు రైతుబందు రాలేదని, రుణమాఫీ సైతం అమలుకాలేదని వాపోయాడు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని గుర్తుచేసుకున్నారు. ఆయన్ను ఏమైనా అంటే పురుగుల పడి చస్తారంటూ.. ఆవేదన వెలిబుచ్చారు. అనంతరం ఛాయ్ తాగుతూ వినోద్‌కుమార్ రాజస్థాన్ హోటల్ యజమానితో గిరాకీ ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు.
రాబోయే రోజులు బీఆర్ఎస్వే : వినోద్
కేసీఆర్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సంపదను పెంపొందించేందుకు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ గుర్తుచేశారు. పల్లెలు పట్టణాల తరహాలో అభివృద్ధి చెందినట్టు తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఆర్థికాభివృద్ధి రేటు పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పథకాల అమలు కోసం కొంత సమయం ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో హామీలు అమల కోసం ఉద్యమం తరహాలో క్షేత్రస్థాయిలో నిరసనలు తెలుపుతామని స్పష్టం చేశారు. ‘మీలాంటి రైతుల సహకారం అవసరం. రాబోయే రోజులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం.. ఎవరూ ఆందోళన చెందవద్దు’ అని భరోసానిచ్చారు.