హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): కొడంగల్ నియోజవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీని ప్రజలు, రైతులు వ్యతిరేకిస్తూ.. ఆ జీవన్మరణ పోరాటంలో మిలిటెంట్ ఉద్యమం చేపడితే వారిపై కేసులు పెడతారా? లగచర్ల రైతుల పోరాటాన్ని వక్రీకరిస్తారా? అంటూ తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రాలన, ప్రజాస్వామ్యం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ గురువారం ఓ లేఖను విడుదల చేశారు. ‘లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీని నిర్మించి, ప్రాకృతిక వనరులతోపాటు రైతుల పంట భూములను కొల్లగొట్టడానికి పథకం పన్నారు. భూములు కోల్పోతున్న లగచర్ల రైతులు తమ జీవన, మరణ పోరాటంలో మిలిటెంట్ ఉద్యమం చేపట్టారు. ప్రజల న్యాయమైన పోరాటాన్ని వక్రీకరించి రైతులపై కేసులు బనాయిస్తారా?’ అని జగన్ ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నది. ఈ కాలంలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొకి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దూకుడుగా పనిచేస్తున్నది. పౌరుల ప్రాథమిక హక్కులను, జీవించే హక్కును కాల రాస్తున్నది. రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టడానికి ఆర్థిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘హైదరాబాద్‌ను గ్లోబలైజేషన్ చేయడానికే మూసీ నది సుందరీకరణ, రివర్బెడ్ ప్రక్షాళన, అక్రమ కట్టడాల పేర్లతో బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్నారు. మూసీ నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పి.. దేశ, విదేశీ కార్పొరేట్లను ఆహ్వానిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మించిన బడా వ్యక్తుల, సంస్థల పెద్ద, పెద్ద అంతస్తులను వదిలేసి ప్రభుత్వాలు ఇచ్చిన అన్ని రకాల అనుమతులతో ఇండ్లు కట్టుకొని, దశాబ్దాలుగా నివాసం ఉంటున్న మధ్య తరగతి, పేద ప్రజలను అక్రమదారులుగా ప్రకటించారు. న్యాయపరమైన అనుమతులు పకన పెట్టి, ప్రజలకు ఎలాంటి ముందుస్తు సమాచారం గాని, నోటీస్‌లు గాని ఇవ్వకుండా అధికార మదంతో దౌర్జన్యపూర్వకంగా, ఆకస్మికంగా రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లతో కష్టజీవులు నిర్మించుకున్న నివాసాలను కూల్చేసి వారి జీవించే హకును హరించి వేస్తున్నారు’ అంటూ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతూ మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో విప్లవకారులపై ఫాసిస్టు దాడులకు పూనుకున్నది. కార్పొరేట్ల లాభాల కోసం కొమ్ముకాస్తూ సీఎం రేవంత్‌రెడ్డి వారి నమ్మిన బంటునని నిరూపించుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడు. వారి పెట్టుబడుల్లో వాటా, పెద్ద మొత్తంలో కమీషన్లు పొందుతున్నాడు. తెలంగాణ ప్రజలారా.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ల అనుకూల, ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక, పాశవిక పాలనను ఖండించండి. ఫార్మాసిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీరోచితంగా మిలిటెంట్ ఉద్యమాలు చేపట్టండి’ అంటూ జగన్ పిలుపునిచ్చారు.