హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): కార్మికశాఖలో వెలుగుచూసిన బీమా కుంభకోణంలో తవ్వినకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్కామ్ వెనుక ఉన్న పెద్దలకు సంచుల మూటలు అందినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్కామ్‌లో చక్రం తిప్పిన కార్మిక శాఖముఖ్య అధికారికి హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డులో డబ్బుల మూటలు అందాయని, ఈ తతంగాన్ని నడిపిన సీఎంవోలోని ప్రత్యేక అధికారికి నాలుగురెట్లు చేరినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. బీమా టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొనకుండా నిబంధలను తెరమీదికి తెచ్చినందుకు ఈ ముడుపులు చెల్లించినట్టు తెలిసింది.
టెండర్ల నుంచే అవినీతి
వాస్తవానికి బీమా కంపెనీలు ఎటువంటి మ ధ్యవర్తులు లేదా బ్రోకరేజ్ కంపెనీలు లేకుండా ప్రభుత్వానికి నేరుగా కొటేషన్లు సమర్పించవచ్చు. కానీ కార్మికశాఖలోకి దానకిశోర్ ప్రవేశం తో ఇదంతా పక్కదారి పట్టినట్టు బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వరంగ బీమా కంపెనీలు టెండర్లలో పాల్గొనకుండా, ప్రైవేట్ కంపెనీలకు నిధులను ధారపోయడానికి ఆంక్షల రూపంలో అడ్డంకులు సృష్టించినట్టు చెప్తున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినవారే టెండర్లలో పాల్గొనడానికి అర్హులనే నిబంధన తీసుకొచ్చినట్టు సమాచారం. ప్రభుత్వరంగ సంస్థలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడం నిబంధనలకు విరుద్ధం. అదితెలిసే ఈ నిబంధనను తెచ్చారని చెప్తున్నారు. ఫలితంగా న్యూ ఇండి యా అస్యూరెన్స్, నేషనల్, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఈ టెండర్‌కు దూరమయ్యాయని సమాచారం. దీంతో బీమా సొమ్ము ప్రైవేట్‌కు వెళ్లిపోయింది.
ఈయనకు రెండు సంచులు.. సార్‌కు నాలుగు రెట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత రెండేండ్లకాలంలో సంక్షేమబోర్డు వెబ్సైట్లో 53,940 దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయి. వీటి క్లెయిమ్‌ల విలువ రూ.321.95 కోట్లు అని వెబ్సైట్లో పొందుపరిచారు. అంటే ఈ లెక్కన వార్షిక సగటు చెల్లింపులు రూ.150 కోట్లు కూడా మించబోవని బీమా రంగ నిపుణులు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ బీమా రంగ కంపెనీలకు ఒక్క ఏడాదికే రూ.346 కోట్లు కట్టబెట్టింది. దీనిని బట్టే ఈ కుంభకోణంలో భారీ ఎత్తున డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని ధ్రువీకరించేలా ఇటీవల కొన్ని సంఘటనలు జరిగినట్టు కార్మిక శాఖలో చర్చ జరుగుతున్నది.
గతనెల మొదటి వారంలో కార్మిక శాఖ కీలక అధికారికి చెందిన వ్యక్తి ఒకరు గచ్చిబౌలి సమీపంలోని ఔటర్ రింగురోడ్డు వద్ద కొందరి నుంచి రెండు డబ్బు సంచులను అందుకొని కారులో పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సంచుల్లోని డబ్బు విలువ రూ.18 కోట్లకుపైనే అనే ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారాన్ని అదేశాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యో గి ఒకరు వీడియో తీసినట్టుగా టంగుటూరి అంజయ్యభవన్లో చెప్పుకుంటున్నారు. ఈ కుంభకోణానికి కర్త, కర్మగా నిలిచి, సీఎంవోలో చక్రంతిప్పిన ప్రత్యేక అధికారికి అంతకు నాలు గు రెట్ల ముడుపులు అందినట్టు సమాచారం.
షెల్ కంపెనీల ప్రవేశం
ఏపీ ప్రభుత్వం అమలుచేసి అభాసుపాలైన బ్రోకింగ్ లైసెన్స్ విధానాన్నే తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నెత్తికి ఎత్తుకున్నది. కార్మికశాఖ ఇన్చార్జి కమిషనర్‌గా దానకిశోర్ ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు బీమారంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఓపెన్టెండర్ విధానంలో ట్రెయిల్ బ్లేజర్ అనే బ్రోకర్ కంపెనీకి బాధ్యతలు ఖరారుచేశారు. ట్రెయిల్ బ్లేజర్‌తో కలిపి ఏడు బ్రోకర్ కంపెనీలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. విచిత్రం ఏమిటంటే.. ఈ ఏడు కంపెనీలు కూడా ట్రెయిల్ బ్లేజర్కి షెల్ కంపెనీలేనని విశ్వసనీయంగా తెలిసింది. ఒకే వ్యక్తి ఈ కంపెనీల వెనకుండి బిడ్డింగ్‌లో పాల్గొన్నట్టు సమాచారం. ప్రైవేట్ బీమా సంస్థల టెండర్లలోనూ ట్రెయిల్ బ్లేజర్ కంపెనీ ప్రతినిధులే ఈఎండీ కట్టి మరీ టెండర్ వేయించి ప్రక్రియను పూర్తిచేసినట్టు తెలుస్తున్నది. అంటే, రూ.250 కోట్లు దారిమళ్లిన పరపతిలేని ‘క్రెడిట్ యాక్సెస్’ కంపెనీకి టెండర్ దక్కడంలోనూ ట్రెయిల్ బ్లేజర్ కంపెనీ పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతున్నది.
అప్పుడు ఏపీలోనూ ఇలాగే..
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో బీమా విధానంలో బ్రోకర్ సంస్థలను ప్రవేశపెట్టింది. దాదాపు 15 ప్రభుత్వ రంగ సంస్థలను బ్రోకర్ బీమా కంపెనీల గొడుకు కిందకు తీసుకువచ్చి గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని అక్కడ అమలుచేశారు. దీనికి ఓ బీమారంగ కన్సల్టెంట్‌ను ప్రభుత్వంలోకి తీసుకొని ప్రత్యేక అధికారాలు కట్టబెట్టారు. ఆయన ఏపీజీఐసీఎల్ (ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) స్థాపించి, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం టెండర్లు పిలిచారు. టెండర్లలో పాల్గొనటానికి డిపాజిట్ నిబంధనను అమల్లోకి తీసుకొచ్చి, ప్రభుత్వ బీమా రంగ సంస్థలు టెండర్లో పాల్గొనకుండా చేశారు. దీంతో ప్రైవేటు కంపెనీలకు తివాచీ పరిచారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విధానాన్ని ఐఆర్డీఏఐ (భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి సంస్థ) కూడా వ్యతిరేకించింది. దీన్ని చట్టవిరుద్దమైన పాలసీగా పేర్కొన్నది. ఏపీ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లింది. ఏపీజీఐసీఎల్ పాలసీని ఐఆర్డీఏఐ వ్యతిరేకించిన నేపథ్యంలో ఏపీఅర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్) ద్వారా బ్రోకింగ్ లైసెన్స్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. రెండేండ్ల వ్యవధిలోనే ఈ విధానంపై ప్రజలు, ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గారు.